ప్రణవ్ రావ్ రాణి, ప్రజక్త గైక్వాడ్ జంటగా నటిస్తున్న బహుభాషా చిత్రం “గూగుల్ మై ఫ్రెండ్”. డాలర్స్ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై దివాకర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి గోవింద్ వరాహ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా పాటల ఆవిష్కరణ కార్యక్రమం తెలుగు దర్శకుల సంఘం ప్రతినిధుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ చిత్రం త్వరలో తెలుగు, మరాఠీ భాషల్లో థియేటర్లలో విడుదల కానుంది.
దర్శకుల సంఘం అధ్యక్షుడు వీఎన్ ఆదిత్య, ప్రముఖ దర్శకులు సాయి రాజేశ్, వి. సముద్ర, శైలేష్ కొలను, కొండా విజయ్ కుమార్ చేతుల మీదుగా పాటలను విడుదల చేశారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ.. గోవింద్ వరాహ బహుభాషా దర్శకుడిగా ఎదుగుతున్నారని, ఒకేసారి రెండు భాషల్లో వస్తున్న ఈ చిత్రం ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. సినిమా టీజర్, కంటెంట్ చాలా ఆసక్తికరంగా ఉన్నాయని ప్రశంసించారు.
చిత్ర దర్శకుడు గోవింద్ వరాహ మాట్లాడుతూ.. దర్శకుల సంఘంలోని తన ఆత్మీయుల మధ్య పాటలు విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారు. ఇతర భాషల్లో బిజీగా ఉంటూ తెలుగుకు దూరమవుతున్న తరుణంలో “గూగుల్ మై ఫ్రెండ్” చేస్తున్నానని, ఇకపై తెలుగులో వరుస సినిమాలు చేస్తానని స్పష్టం చేశారు. తనకు అండగా నిలుస్తున్న నిర్మాతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. టి. వెంకటేష్ రెడ్డి, బి. ప్రసన్నాంజనేయులు ఈ చిత్రానికి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.


