పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ‘కనక దుర్గ’

పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ‘కనక దుర్గ’

Published on Apr 7, 2026 5:30 PM IST

Kanaka Durga

కోలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్ స్టూడియోగా పేరున్న అప్లాజ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్, ఇప్పుడు టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. అల్లరి నరేష్ హీరోగా, ప్రదీప్ మద్దాలి దర్శకత్వంలో టెంపుల్ టౌన్ పిక్చ‌ర్స్‌తో కలిసి నిర్మిస్తున్న ‘కనక దుర్గ’ చిత్రం శనివారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. కాజల్ చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ భక్తిరస చిత్రానికి బి.వి.ఎస్. రవి కథను అందించగా, సమీర్ నాయ‌ర్‌, దీపక్ సెహ‌గ‌ల్‌, అజిత్ ఠాకూర్‌, బి.వి.ఎస్‌.ర‌వి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

భారతీయ పురాణాల నేపథ్యంతో, భక్తి, యాక్షన్ మరియు భావోద్వేగాల కలయికగా రూపొందుతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు ఒక దివ్యమైన సినిమాటిక్ అనుభూతిని అందించనుంది. అప్లాజ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్, టెంపుల్ టౌన్ పిక్చ‌ర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ మూవీ ప్రారంభోత్సవం శనివారం అత్యంత వైభవంగా జరిగింది.

​ఈ వేడుకకు సురేఖ కొణిదెలతో పాటు అల్లు అరవింద్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, హరీష్ శంకర్, ప్రశాంత్ వర్మ, స్వప్నా దత్ వంటి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. చిత్ర ఇతివృత్తానికి అనుగుణంగా, పూజా కార్యక్రమం ముగింపులో కనకదుర్గ అమ్మవారి దివ్య శక్తిని స్మరిస్తూ, హాజరైన మహిళా అతిథులందరూ కలిసి అమ్మవారి మహిమలను కొనియాడారు.

ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ కొట్టగా, సురేఖ కొణిదెల కెమెరా స్విచ్ ఆన్ చేశారు. స్వప్న దత్ గౌరవ దర్శకత్వం వహించగా, శ్యామ్ ప్రసాద్ రెడ్డి చిత్ర యూనిట్‌కు స్క్రిప్ట్‌ను అందజేశారు.

అప్లాజ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ మూవీస్ బిజినెస్ హెడ్ సునీల్ చైనాని మాట్లాడుతూ.. “దక్షిణ భారత చలనచిత్ర రంగం వైవిధ్యమైన కథలకు పెట్టింది పేరు. తమిళంలో మా ప్రయాణం ఎంతో విజయవంతంగా సాగింది, ఇప్పుడు ‘కనక దుర్గ’ చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టడం సంతోషంగా ఉంది. భక్తి, సంస్కృతి మరియు బలమైన భావోద్వేగాల కలయికతో ఈ సినిమా రూపొందుతోంది. అల్లరి నరేష్, ప్రదీప్ మద్దాలి, అజిత్ ఠాకూర్ మరియు బి.వి.ఎస్. రవి వంటి ప్రతిభావంతులతో కలిసి పనిచేయడం గొప్ప అనుభూతినిస్తోంది” అని పేర్కొన్నారు.

టెంపుల్ టౌన్ పిక్చర్స్ నిర్మాతలు అజిత్ ఠాకూర్, బి.వి.ఎస్. రవి మాట్లాడుతూ.. “‘కనక దుర్గ’ కథ తెలుగు వారి ఆధ్యాత్మికత మరియు సంస్కృతితో పెనవేసుకుపోయినది. మా బ్యానర్‌లో నిర్మిస్తున్న తొలి తెలుగు సినిమా ఇదే కావడం, అది కూడా ఇంతటి పవిత్రమైన కథతో మా ప్రయాణం మొదలవ్వడం చాలా ప్రత్యేకం. అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్ వంటి గొప్ప భాగస్వామ్యంతో కలిసి ఈ సినిమా చేయడం మా అదృష్టం. అమ్మవారి ఆశీస్సులతో, దైవ అనుగ్రహంతోనే ఈ ప్రాజెక్ట్ ముందుకు సాగుతోందని నమ్ముతున్నాం” అని పేర్కొన్నారు.

దర్శకుడు ప్రదీప్ మద్దాలి మాట్లాడుతూ.. “‘కనక దుర్గ’ చిత్రం నాకు ఎంతో ప్రత్యేకం. దర్శకుడిగానే కాకుండా, అమ్మవారి భక్తుడిగా ఈ కథ నా హృదయానికి చాలా దగ్గరైంది. ఇది కేవలం భక్తి చిత్రం మాత్రమే కాదు.. జీవితంలో అన్నీ కోల్పోయిన ఒక సామాన్యుడు, తనకంటే గొప్పదైన దైవిక శక్తిని ఎదుర్కొన్నప్పుడు జరిగే ఉద్వేగభరితమైన పోరాటం. మా కథను నమ్మి ‘అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్’, ‘టెంపుల్ టౌన్ పిక్చర్స్’ వంటి సంస్థలు ఇంతటి భారీ స్థాయిలో, అత్యున్నత విజువల్స్‌తో ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లడం చాలా గర్వంగా, సంతోషంగా ఉంది” అని పేర్కొన్నారు.

తాజా వార్తలు