కికు యనమల, కశిష్ ఖాన్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం “చిరంజీవి”. సాయి వెంకట్ దర్శకత్వంలో కికు ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై దీప్తి నడిమింటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మెగా బ్రదర్ నాగబాబు చేతుల మీదుగా లాంచ్ చేశారు. ఫస్ట్ లుక్ విడుదల చేసినందుకు చిత్ర బృందం ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.
కుడివైపు గుండె… విభిన్నమైన కథాంశం
సాధారణంగా గుండె ఎడమవైపు ఉంటుంది. కానీ అరుదుగా కొందరికి కుడివైపు ఉంటుంది. వైద్య పరిభాషలో దీనిని ‘డెక్స్ట్రోకార్డియా’ అంటారు. అచ్చం ఇలాంటి పరిస్థితే ఉన్న చిరు అనే యువకుడి కథే ఈ ‘చిరంజీవి’ సినిమా. కుడివైపు గుండె ఉన్న ఆ కుర్రాడు తన జీవితంలో ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నాడు? సమాజం నుంచి ఎదురైన ఇబ్బందులను ఎలా దాటుకుని వచ్చాడు? తాను అనుకున్న లక్ష్యాలను ఎలా సాధించాడు? అనే అంశాలను దర్శకుడు సాయి వెంకట్ ఎంతో స్ఫూర్తిదాయకంగా తెరకెక్కిస్తున్నారు.
కథలో ఎమోషన్‌తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా సమానంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. తనికెళ్ల భరణి, ఈశ్వరీ రావు, గోపరాజు రమణ లాంటి సీనియర్ నటులతో పాటు శ్రీకాంత్ భరత్, వైవా రాఘవ లాంటి వారు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
సమ్మర్ రేసులో ‘చిరంజీవి’
ప్రస్తుతం నిర్మాణ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమాను వేసవి కానుకగా థియేటర్లలోకి తీసుకురానున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. త్వరలోనే అధికారిక రిలీజ్ డేట్‌ను మేకర్స్ అనౌన్స్ చేయనున్నారు. కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ ‘చిరంజీవి’ ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పిస్తాడో చూడాలి.



