ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి జన్మదిన వేడుకలు హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్లో ఘనంగా నిర్వహించారు. పలువురు సినీ ప్రముఖులు హాజరైన ఈ కార్యక్రమంలో ఆయన దర్శకత్వం వహిస్తున్న 43వ చిత్రం “వేదవ్యాస్” మేకింగ్ వీడియోను విడుదల చేశారు. ఇదే సమయంలో, తాను దర్శకత్వం వహించిన 42 చిత్రాలలో 38 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించినందుకు గాను ఎస్వీ కృష్ణారెడ్డికి ‘తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్’ నుంచి వరల్డ్ రికార్డ్ గుర్తింపు పత్రాన్ని అందజేశారు.
“వేదవ్యాస్” చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కె. అచ్చిరెడ్డి సమర్పణలో, సాయి ప్రగతి ఫిలిమ్స్ బ్యానర్‌పై కొమ్మూరి ప్రతాపరెడ్డి నిర్మిస్తున్నారు. మన వేదాల గొప్పదనం, వాటి వెనుక ఉన్న సైన్స్ నేపథ్యంతో ఈ సినిమా కథాంశం ఉంటుందని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రంతో పిడుగు విశ్వనాథ్ హీరోగా పరిచయమవుతుండగా, కొరియన్ నటి జూన్ హ్యూంజీ, మంగోలియన్ నటుడు షరన్ బోల్డ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది.
ఈ వేడుకలో పాల్గొన్న సీనియర్ నటులు మురళీమోహన్, శ్రీకాంత్, అలీ, లయ, జేడీ చక్రవర్తి, శివాజీరాజా తదితరులు ఎస్వీ కృష్ణారెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన చిత్ర పరిశ్రమలో మరిన్ని మంచి చిత్రాలు తీయాలని ఆకాంక్షించారు. తన పుట్టినరోజున వరల్డ్ రికార్డ్ అందుకోవడం ఆనందంగా ఉందని, కార్యక్రమానికి విచ్చేసిన అతిథులందరికీ ఎస్వీ కృష్ణారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.


