కన్నడ స్టార్ హీరో యష్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘టాక్సిక్’ పై సోషల్ మీడియాలో కొన్ని నెగిటివ్ వార్తలు తెగ హల్‌చల్ చేస్తున్నాయి. సినిమా అవుట్‌పుట్ పట్ల యష్ అసంతృప్తిగా ఉన్నాడని, అందుకే భారీ ఖర్చుతో చిత్ర యూనిట్ రీషూట్స్ ప్లాన్ చేస్తోందనే పుకార్ల చక్కర్లు కొడుతున్నాయి. అయితే, ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని చిత్ర బృందం స్పష్టం చేసింది. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయని, ఫైనల్ కంటెంట్ సిద్ధంగా ఉందని మేకర్స్ ఈ రూమర్లకు గట్టిగా చెక్ పెట్టారు.
భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా నాన్-థియేట్రికల్ డీల్స్ క్లోజ్ అయిన వెంటనే సరికొత్త విడుదల తేదీని అధికారికంగా ప్రకటించడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అంతేకాకుండా, ఈ చిత్రాన్ని ఇంగ్లీష్ భాషలో కూడా ఒకేసారి విడుదల చేస్తుండటంతో, యష్ ప్రస్తుతం ఇంటర్నేషనల్ వేదికలపై సినిమాను భారీగా ప్రమోట్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. అంతా అనుకున్నట్టు జరిగితే ఈ ఏడాది ఆగస్టులోనే ‘టాక్సిక్’ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తుండగా కియారా అద్వానీ, నయనతార, హ్యూమా ఖురేషీ, తారా సుతారియా మరియు రుక్మిణి వసంత్ వంటి స్టార్ హీరోయిన్లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ మరియు మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాయి.


