నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నారు. బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్టులతో బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 111వ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న బాలయ్య.. తాజాగా మరో భారీ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ (NBK112) అమరావతిలో ఈరోజే అత్యంత ఘనంగా ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ మంత్రులు నారా లోకేష్, కందుల దుర్గేష్ ఈ పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
రూ. 200 కోట్ల భారీ బడ్జెట్.. ఆగస్టు నుంచే షూట్!
ఈ సినిమా లాంచ్ ఈవెంట్‌కు ముందే నిర్మాత సుధాకర్ చెరుకూరి ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఆసక్తికర వివరాలను పంచుకున్నారు. బాలకృష్ణ ఇమేజ్‌కు తగ్గట్టుగా, సరికొత్త కథాంశంతో ఈ సినిమాను పాన్-ఇండియా లెవెల్లో ప్లాన్ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ క్రేజీ యాక్షన్ ఎంటర్‌టైనర్ కోసం దాదాపు రూ. 150 కోట్ల నుంచి రూ. 200 కోట్ల వరకు బడ్జెట్ కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.
ఈ ఏడాది ఆగస్టు నుంచే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. అంతేకాదు, లాంచ్ రోజే రిలీజ్ విండోను కూడా మేకర్స్ లాక్ చేయడం విశేషం. 2027 సమ్మర్ కానుకగా ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.
తాజా ప్రకటనతో NBK112 చిత్రం 2027 వేసవి రేస్‌లోకి అఫీషియల్‌గా అడుగుపెట్టినట్లయింది. బాలయ్య రేంజ్‌కు తగ్గ భారీ యాక్షన్ విజువల్స్‌తో కొరటాల శివ ఈ సినిమాను మలిచే పనిలో ఉన్నారు. యువసుధ ఆర్ట్స్ భాగస్వామ్యంతో నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటించబోయే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను మేకర్స్ త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారు.


