సమీక్ష: విజయ్ ‘జన నాయకుడు’ – యాక్షన్ ఎక్కువ.. ఎమోషన్ తక్కువ!

సమీక్ష: విజయ్ ‘జన నాయకుడు’ – యాక్షన్ ఎక్కువ.. ఎమోషన్ తక్కువ!

Published on Jul 24, 2026 2:02 AM IST

విడుదల తేదీ : జూలై 23, 2026

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు : ద‌ళ‌ప‌తి విజ‌య్‌, పూజా హెగ్డే, మ‌మితా బైజు, బాబీ డియోల్‌, ప్ర‌కాష్‌, సునీల్ త‌దిత‌రులు.
దర్శకత్వం : హెచ్ వినోథ్‌
సంగీతం : అనిరుధ్‌
నిర్మాత : వెంక‌ట్ కె.నారాయ‌ణ
ఛాయాగ్రహణం : స‌త్య‌న్ సూర్య‌న్‌
కూర్పు : ప్ర‌దీప్‌

సంబంధిత లింక్స్ : ట్రైలర్

తమిళనాడు సీఎం విజయ్ హీరోగా నటించిన సినిమా ‘జన నాయగన్’. తెలుగులో ‘జన నాయకుడు’గా విడుదల చేశారు. కాగా భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్ష లోకి వెళ్ళి చూద్దాం.

కథ :

దళపతి వెట్రి కొండాన్ (విజయ్) కొన్ని కారణాల వల్ల జైలు జీవితం గడుపుతూ ఉంటాడు. ఐతే, తన తల్లిని చూడటానికి జైలు అధికారి, దళపతికి అవకాశం కల్పిస్తాడు. కానీ, ఆ కారణంగా ఆ అధికారి పై వేటు పడుతుంది. విషయం తెలుసుకున్న దళపతి, ఆ అధికారి ఇంటికి వెళ్తాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఆ పోలీస్ అధికారి కూతురు విజ్జి (మమితా బైజు) బాధ్యత, దళపతి పై పడుతుంది. ఆమెను కంటికి రెప్పలా కాపాడుతూ పెంచుతాడు చిచ్చా అలియాస్ దళపతి. ఆమెను ఆర్మీ ఆఫీసర్ చేయాలనేది చిచ్చా కోరిక. అసలు కోరికకు కారణం ఎవరు ?, ఈ మధ్యలో జాన్ హిమ్లర్ (బాబీ డియోల్) పాత్ర ఏమిటి ?, అతని టార్గెట్ ఏమిటి ?, మరోవైపు రాజకీయ నేత రోజా రంగసామి (ప్రకాష్ రాజ్)తో దళపతికి ఉన్న గతం ఏమిటి ?, చివరకు, జాన్, రోజా రంగసామి పథకాన్ని దళపతి ఎలా అంతం చేశాడు ?, విజ్జిలో భయాన్ని ఎలా పోగొట్టాడు ? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

ఎప్పటిలాగే ద‌ళ‌ప‌తి విజ‌య్‌ తన పాత్రలో అద్భుతంగా నటించాడు. కీలక సన్నివేశాల్లో విజయ్ యాక్షన్ గ్రెస్ అండ్ ఎమోషల్ సీన్స్ లో అతని అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్. ముఖ్యంగా విజయ్ నుంచి ఆయన అభిమానులు ఎలాంటి సినిమా కోరుకుంటున్నారో, ఈ సినిమా అలాగే భారీ విజువల్స్ మరియు ‘వైల్డ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్’ తో సాగింది. ఇక వాటికి తగ్గట్టుగానే తన పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ, తన పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ తో ద‌ళ‌ప‌తి విజ‌య్‌ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు.

జాన్ హిమ్లర్ గా బాబీ డియోల్ తన పాత్రలో ఒదిగిపోయారు. కొన్ని కీలక సన్నివేశాల్లో ఆయన నటన చాలా బాగుంది. మ‌మితా బైజు తన పాత్రలో జీవించింది. ఆమె పాత్రలోని డెప్త్ కూడా ఆకట్టుకుంది. హీరోయిన్ పూజా హెగ్డే కూడా చాలా బాగా నటించింది. ఆమె స్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా బాగుంది. ఇతర కీలక పాత్రల్లో కనిపించిన ప్ర‌కాష్‌ రాజ్, సునీల్ ఆకట్టుకున్నారు. అదేవిధంగా ప్రియమణితో పాటు మిగిలిన నటీనటులు కూడా ఆయా పాత్రల్లో తమ నటనతో మెప్పించారు.

మైనస్ పాయింట్స్ :

‘జన నాయకుడు’గా వచ్చిన ఈ చిత్రం బరువైన ఎమోషన్స్ తో, భారీ విజువల్స్ తో కొంతవరకు ఆకట్టుకున్నా.. కథనం పరంగా వచ్చే చాలా సీన్స్ బోరింగ్ ప్లేతో సాగాయి. దర్శకడు ఈ సినిమా ట్రీట్మెంట్ ను బాగా రాసుకోలేదు. ముఖ్యంగా ఆసక్తికరంగా కథనాన్ని రాసుకోవడంలో వినోథ్‌ కొన్ని చోట్ల విఫలం అయ్యారు. చాలా సన్నివేశాలు బాగా స్లోగా సాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది.

పైగా సెకండాఫ్ ని మరీ సాగతీశారు. ఒక్క క్లైమాక్స్ లో తప్ప మిగిలిన కథనంలో ఉత్సుకతను పెంచటంలో విఫలమయ్యారు. ఇక విజయ్ – విలన్ల మధ్య ట్రాక్ ఇంకా బెటర్ గా ఉండి ఉంటే బాగుండేది. మొత్తానికి కథలో చెప్పాలనుకున్న మెయిన్ థీమ్ తో పాటు కీలక సన్నివేశాల్లో మంచి పనితీరుని కనబర్చిన దర్శకుడు హెచ్ వినోథ్‌, మిగిలిన కొన్ని సన్నివేశాల్లో మాత్రం నెమ్మదిగా కనిపించారు.

సాంకేతిక విభాగం :

ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే.. సినిమాటోగ్రాఫర్‌ స‌త్య‌న్ సూర్య‌న్‌ సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది. సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటు మిగిలిన యాక్షన్ సన్నివేశాలను కూడా కథాకథనాలకు అనుగుణంగా అద్భుతంగా చిత్రీకరించారు. ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. ఇక సంగీత దర్శకుడు అనిరుధ్‌ సమకూర్చిన పాటలు చాలా బాగున్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా బాగుంది. నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంది. హెచ్ వినోథ్‌ రచయితగా దర్శకుడిగా ఈ చిత్రానికి పూర్తి న్యాయం చేయలేదు. నిర్మాత వెంక‌ట్ కె.నారాయ‌ణ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి.

తీర్పు :

మాస్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈ ‘జన నాయకుడు’ సినిమా ఆకట్టుకోలేకపోయింది. సినిమాలో బలమైన ఎమోషన్, కాన్ ఫ్లిక్ట్ ఉన్నప్పటికీ… ఆ ఎమోషన్ లో, ఆ కాన్ ఫ్లిక్ట్ లో ప్రేక్షకుడు ఇన్ వాల్వ్ అయ్యేంతగా.. అవి సరిగ్గా ఎస్టాబ్లిష్మెంట్ కాలేదు. దీనికితోడు సెకండ్ హాఫ్ లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి. ఓవరాల్ గా విజయ్ అభిమానులకు ఈ చిత్రంలో కొన్ని ఎలిమెంట్స్ కనెక్ట్ అయినా, సినిమా మాత్రం ఆకట్టుకోదు.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team

సంబంధిత సమాచారం

తాజా వార్తలు