​సమీక్ష: దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’ – కాన్సెప్ట్ బాగున్నా, కథనంలో లోపించిన పట్టు!

​సమీక్ష: దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’ – కాన్సెప్ట్ బాగున్నా, కథనంలో లోపించిన పట్టు!

Published on Sep 4, 2026 12:01 AM IST

విడుదల తేదీ : సెప్టెంబర్ 03, 2026

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు : దుల్కర్ సల్మాన్, కయాదు లోహర్, మిస్కిన్, ఆంటోనీ వర్గీస్ తదితరులు
దర్శకత్వం : నహాస్ హిదాయత్
సంగీతం : జేక్స్ బిజోయ్
నిర్మాత : దుల్కర్ సల్మాన్
ఛాయాగ్రహణం : జిమ్షీ ఖాలిద్
కూర్పు : చమన్ చాకో

సంబంధిత లింక్స్ : ట్రైలర్

ఈ వారం థియేటర్స్ లో విడుదలకి వచ్చిన లేటెస్ట్ సినిమాల్లో మలయాళం యూత్ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన అవైటెడ్ సినిమా ఐమ్ గేమ్ కూడా ఒకటి. తెలుగులో పలు ఇబ్బందులు ఎదురైన ఈ సినిమా మలయాళం లోనే తెలుగు రాష్ట్రాల్లో విడుదల అయ్యింది. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

డాన్ జాన్ (దుల్కర్ సల్మాన్) జూదానికి బానిసైన వ్యక్తి. అతడు తనకున్నదంతా పోగొట్టుకుని అప్పుల ఊబిలో కూరుకుపోతాడు. అయినా వెనక్కి తగ్గకుండా, ఎలాగైనా తన డబ్బును తిరిగి రాబట్టుకోవాలనే నిరాశ, కోపంతో డాన్ ఒక పెద్ద గొడవకు దిగుతాడు. కానీ ఆ గొడవ దెబ్బతో తను కోమాలోకి వెళ్లిపోతాడు. అతను స్పృహలోకి వచ్చిన తర్వాత అంతా మామూలుగానే ఉందని అందరూ అనుకుంటారు, కానీ తనలో ఏదో వింత మార్పు జరిగిందని డాన్ త్వరలోనే గ్రహిస్తాడు. అసలు డాన్‌ కి ఏమైంది? అతను ఎదుర్కొంటున్న ఆ వింత సంఘటన ఏమిటి? అది తనకి ప్లస్సయ్యిందా లేక మైనస్సయ్యిందా అనేవి తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి.

ప్లస్ పాయింట్స్:

వినూత్న సబ్జెక్ట్ లు ఎంచుకోవడంలో దుల్కర్ సల్మాన్ కి సెపరేట్ మార్క్ ఉంది. అదే కోవలో ఈ ఐమ్ గేమ్ కూడా మరో వినూత్న అటెంప్ట్ అని చెప్పొచ్చు. ప్రధాన కథాంశం కొత్తగా, మొదటి నుంచీ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించే విధంగా ఇందులో కనిపిస్తుంది. ఆ కొత్తదనమే ఈ సినిమాకు ఉన్న అతిపెద్ద బలంగా పరిగణించవచ్చు.

ఇక దుల్కర్ తన నటనతో మరోసారి అద్భుతంగా ఆకట్టుకున్నాడు. తన నటనలో ఎలాంటి వంక పెట్టడానికి ఏమీ లేదు. ముఖ్యంగా ఇంటర్వెల్ సన్నివేశంలో అతను పడిన కష్టం తెరపై చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ డిఫరెంట్ సబ్జెక్ట్, తన పాత్రలోని విభిన్న భావోద్వేగాలను, షేడ్స్‌ను ప్రదర్శించడానికి అతనికి తగినంత అవకాశం ఇచ్చింది అని చెప్పొచ్చు.

అలాగే కయాదు లోహర్ తెరపై అందంగా కనిపించింది. దుల్కర్‌తో ఆమె సన్నివేశాలు బాగానే పండాయి. విలన్‌గా మిస్కిన్ తన పాత్రకు న్యాయం చేశాడు, సంయుక్త విశ్వనాథ్ పాత్ర చిన్నదే అయినా మంచి ముద్ర వేసింది. సెకండాఫ్‌లో ఎంట్రీ ఇచ్చే ఆంటోనీ వర్గీస్ ఎమోషనల్ యాక్టింగ్‌తో అదరగొట్టి సినిమాకు చాలా హెల్ప్ అయ్యాడు. ఫైట్ సీన్స్‌లో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇంప్రెస్ చేస్తుంది. వాటిని సంగీత దర్శకుడు జేక్స్ బిజొయ్ బాగా ఎలివేట్ చేసాడు.

మైనస్ పాయింట్స్:

ఇందులో కథాంశం కొత్తగా ఉన్నప్పటికీ, తెరపై దాన్ని ఆవిష్కరించిన విధానం చాలా రొటీన్ గానే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ కథను బాగా సెట్ చేసి ఒక పెద్ద ట్విస్ట్‌తో ముగుస్తుంది. దీనితో సెకండాఫ్ ఏ రేంజ్ లో ఉంటుంది అనే ఉత్సుకత మేకర్స్ మిగిల్చారు. కానీ అందుకు భిన్నంగా సెకండాఫ్ కథనం పేలవంగా మిగిలిపోవడం బాధాకరం. కథ ముందుగానే ఊహించేలా ఉండటంతో మెల్లగా సినిమాపై పట్టు తగ్గిపోతుంది.

యాక్షన్ సన్నివేశాలు మొదట బాగానే అనిపించినా, తర్వాత ఏం జరగబోతుందో ముందే తెలిసిపోవడం వల్ల త్వరగానే విసుగు తెప్పిస్తాయి. ఉత్కంఠను కొనసాగించడానికి దర్శకుడు, రచయిత మరికొన్ని సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ జోడించి ఉండాల్సింది. అంతేకాకుండా, క్రికెట్ బెట్టింగ్ నేపథ్యం ఇదివరకు చాలా సినిమాల్లో చూసిందే కాబట్టి, ఆ కోణంలో ఈ సినిమా కొత్తగా ఏమీ చూపించలేదు.

సినిమా నిడివి కూడా దీనికి ఉన్న మరో పెద్ద మైనస్. ఇలాంటి కథకు దాదాపు మూడు గంటల సమయం అవసరం లేదు. ఒక ఇరవై నుంచి ముప్పై నిమిషాల నిడివిని తగ్గించి ఉంటే సినిమా మరింత వేగంగా, ఆసక్తికరంగా ఉండేది. మిస్కిన్ తన వరకు బాగానే చేసినా, తన పాత్ర అంత ఇంపాక్ట్ అయితే మిగిల్చదు.

సాంకేతిక విభాగాలు:

ఈ సినిమాలో నిర్మాణ విలువలు మాత్రం బాగున్నాయి. కెమెరా వర్క్, ఫాస్ట్ ఎడిటింగ్ సినిమాను చాలా స్టైలిష్‌గా, క్లీన్‌గా చూపించాయి. అన్ని సాంకేతిక విభాగాలు సమన్వయంతో పనిచేసి సినిమాకు ఒక గ్రాండ్, కమర్షియల్ లుక్ తీసుకొచ్చాయి. జేక్స్ బిజొయ్ దుల్కర్ కి మరో సాలిడ్ సౌండింగ్ అందించాడు.

ఇక దర్శకుడు నహాస్ హిదాయత్ విషయానికి వస్తే.. ఒక ఆసక్తికరమైన కథాంశంతో మొదలుపెట్టాడు కానీ, దాన్ని ఆద్యంతం ఉత్కంఠభరితంగా మలచడంలో మాత్రం తడబడ్డాడు. కొన్ని సన్నివేశాల్లో తన ప్రతిభను కనబరిచినా, పూర్తి స్థాయిలో తన వర్క్ ఇంప్రెస్ చేయలేకపోయింది.

తీర్పు:

ఇక మొత్తంగా చూసుకుంటే, ‘ఐమ్ గేమ్’ ఆసక్తికరమైన కథాంశాన్ని కలిగి ఉన్నప్పటికీ, కథనంలో ఇంపాక్ట్ లోపించింది. దుల్కర్ సల్మాన్, సాంకేతిక బృందం సినిమాను నిలబెట్టడానికి తమ వంతు కృషి చేసినా, నెమ్మదిగా సాగే సెకండాఫ్, ఊహాజనితంగానే సాగే సీన్స్ ఈ సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. సో ఈ సినిమా అక్కడక్కడా మాత్రమే వర్కౌట్ అవుతుంది. కాబట్టి, కొత్త కథలను ఇష్టపడే యాక్షన్ సినీ ప్రియులు ఎలాంటి అంచనాలు లేకుండా ఒకసారికి ట్రై చేయవచ్చు.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు