సౌత్ ఇండస్ట్రీలో ఒకప్పుడు వరుస ఆఫర్లతో దూసుకుపోయిన బ్యూటీ ప్రియాంక మోహన్. తెలుగు, తమిళ భాషల్లోని స్టార్ హీరోల సరసన నటించి విశేష ప్రజాదరణ పొందిన ఈ భామ, ప్రస్తుతం తన కెరీర్‌లో ఒకింత నెగిటివ్ రన్ ఎదుర్కొంటోంది. పవన్ కల్యాణ్ సరసన నటించిన ‘ఓజీ’ వంటి భారీ చిత్రం తర్వాత ఆమె నటించిన నెట్‌ఫ్లిక్స్ ప్రాజెక్ట్ ‘మేడ్ ఇన్ కొరియా’ ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది.
ప్రస్తుతం కవిన్ సరసన ‘K09’, మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ‘మంజనత్తి’ చిత్రాల్లో నటిస్తున్నప్పటికీ, కెరీర్ గ్రాఫ్ కాస్త నెమ్మదించిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తాజాగా ఏజీఎస్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న 29వ చిత్రంలో నటుడు జై సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా ఎంపికైనట్లు అధికారిక ప్రకటన వెలువడింది. అయితే ఈ అప్‌డేట్‌పై సోషల్ మీడియాలో విభిన్న రకాల చర్చలు నడుస్తున్నాయి.
స్టార్ హీరోలతో నటించిన ఆమె, ఇప్పుడు చిన్న సినిమాలను అంగీకరించడం కెరీర్ డౌన్‌ఫాల్‌కు సంకేతమని కొందరు అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు శింబు రాబోయే చిత్రం ‘అరసన్’లోనూ ఆమె కీలక పాత్ర పోషిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఈ రాబోయే చిత్రాలతో ప్రియాంక మోహన్ తన నటనను నిరూపించుకుని, తిరిగి పూర్వ వైభవాన్ని అందుకని తన స్థానాన్ని నిలబెట్టుకుంటుందో లేదో వేచి చూడాలి.


