కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం కాంబినేషన్లో మరో కొత్త సినిమా రాబోతున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం మణిరత్నం తెరకెక్కిస్తున్న ‘ఇంజి వెల్లం’ చిత్రం పూర్తయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ను పట్టాలెక్కించేందుకు చర్చలు నడుస్తున్నట్లు తెలుస్తోంది.
దాదాపు ఎనిమిదేళ్ల క్రితమే మణిరత్నం ఒక కథను సూర్యకు వినిపించినప్పటికీ, వివిధ కారణాల వల్ల ఆ సినిమా రూపుదిద్దుకోలేదు. ఇప్పుడు అదే కథలో కొన్ని మార్పులు చేర్పులు చేసి సూర్యకు వినిపించేందుకు మణిరత్నం సిద్ధమవుతున్నారట. ఈ కథ సూర్యకు నచ్చితే, ఈ కాంబినేషన్లో సినిమా త్వరలోనే అధికారికంగా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.
గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘యువ’ చిత్రం మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ‘నవరస’ ఆంథాలజీ సిరీస్ కోసం వీరు కలిసి పనిచేసినా, పూర్తిస్థాయి చిత్రంగా మాత్రం రాబోయే ప్రాజెక్టే కానుంది. మరి నిజంగానే ఈ కాంబో త్వరలో సెట్ అవుతుందా లేదా అనేది వేచి చూడాలి.


