ఇంటర్వ్యూ: బాబీ సింహా – ‘డిస్కో రాజా’లో మంచి కంటెంట్ ఉంది !

ఇంటర్వ్యూ: బాబీ సింహా – ‘డిస్కో రాజా’లో మంచి కంటెంట్ ఉంది !

Published on Jan 21, 2020 4:31 PM IST

మాస్ మహారాజ్ రవితేజ, నభా నటేష్, పాయల్ రాజ్ పుత్ హీరోహీరోయిన్లుగా దర్శకుడు వి ఐ ఆనంద్ తెరకెక్కించిన చిత్రం డిస్కో రాజా. ఓ వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రాన్నీ ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి నిర్మించారు. ఈనెల 24న విడుదల కానున్న ఈ సినిమాలో బాబీ సింహా విలన్ గా నటించారు. ఈ సంధర్భంగా బాబీ సింహా మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

 

మీ నేపథ్యం గురించి.. అలాగే మీ కుటుంబం గురించి ?

మా పేరెంట్స్ నేటివ్ మచిలీపట్నం. అయితే నేను పుట్టింది హైదరాబాదే. కానీ ఆ తరువాత మా ఫ్యామిలీ కోడై కెనాల్ లో సెటిల్ అయింది. కోడై కెనాల్ లో మా పేరెంట్స్ వ్యవసాయం చేసేవారు. నేను యాక్టర్ అవుదామని నిర్ణయించుకున్నాక చెన్నై వెళ్లి ప్రయత్నాలు చేశాను. అలా అవకాశాలు వచ్చాయి.

 

‘డిస్కో రాజా’ సినిమా గురించి ?

మాస్ సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ తో డిస్కో రాజా ఉండబోతుంది. సినిమా టైటిల్ కమర్షియల్ గా ఉన్నప్పటికీ సినిమాలో మాత్రం మంచి కంటెంట్ కూడా ఉంటుంది. మా డైరెక్టర్ వి ఐ ఆనంద్ గారి శైలిలో ఈ సినిమా చాల బాగా వచ్చింది. ఆయన క్లారిటీ ఆయన ప్రెజెంటేషన్ అద్భుతంగా ఉంటుంది. ఫుల్ మాస్ అండ్ కామెడీతో సాగుతూనే ఈ సినిమా స్క్రీన్ ప్లే చాలా భిన్నంగా ఉంటుంది.

 

మీ రోల్ ఎలా ఉండబోతుంది. సీరియస్ గా ఉంటుందా ? లేక ఫన్ కూడా మిక్స్ అయి ఉంటుందా ?

అన్ని ఉంటాయి అండి. జోవియల్, సీరియస్ అండ్ నా శైలి యాక్టింగ్ ఇలా అన్ని ఉంటాయి. ఈ సినిమాలో ‘బర్మా సేతు’ అనే క్యారెక్టర్ చేస్తున్నాను. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో నా రోల్ కాస్త కొత్తగా కూడా ఉంటుంది. నెను కూడా కొత్తగా కనిపిస్తాను, అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను.

 

మీరు ఇండస్ట్రీకి వచ్చింది విలన్ అవ్వాలని, లేక హీరో అవ్వాలని ?

లేదు అండి, నేను యాక్టర్ అవుదామనే వచ్చాను. కానీ మధ్యలో హీరోగా అవకాశాలు వచ్చాయి, చేశాను. కానీ చేసిన సినిమాలు ప్లాప్ అయ్యాయి.

 

యాక్టర్స్ లో మీకు బాగా నచ్చి మీరు ప్రేరణ పొందినవాళ్లు ఎవరు ?

రజినీకాంత్ సర్. నాకు ప్రేరణ అంటే ఆయనే. అలాగే చిరంజీవిగారు ఇష్టం.. కమల్ హాసన్ గారు కూడా ఇష్టమే. ఒక్కొక్కరికి ఒక్కో శైలి ఉంటుంది. ప్రతి ఒక్కరూ నుండి ఏదోకటి నేర్చుకుంటాను.

 

మీరు జూనియర్ ఆర్టిస్ట్ గా కూడా చేశారట ?

అవును చేశాను. రోజుకు 250 రూపాయిల కోసం పనిచేసిన రోజులు కూడా ఉన్నాయి. కానీ, ఆ రోజులు గురించి ఇప్పుడు తల్చుకుంటే హ్యాపీగా అనిపిస్తోంది. కానీ ప్రస్తుతం రోజులు మారాయి. సోషల్ మీడియా వల్ల అవకాశాలు పెరిగాయి. ఒక చిన్న వీడియో వల్ల కూడా మన టాలెంట్ చూపించొచ్చు.

 

రవితేజగారి ఎనర్జీ గురించి ?

రవితేజగారిది వెరీ వెరీ పాజిటివ్ ఎనర్జీ అండి. ఆయన మార్క్ యాక్టింగ్ సినిమాలో చాల బాగా అలరిస్తోంది. ఇక ఆయనలో నాకు బాగా నచ్చింది ఆయన టైమ్ సెన్స్ అండ్ జన్యూనిటీ. చాల పర్ ఫెక్ట్ గా ఉంటారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు