ఇంటర్వ్యూ : విక్టరీ వెంకటేష్ – ఇమేజ్ అనే చట్రం నుండి బయటకి రావాలి..

ఇంటర్వ్యూ : విక్టరీ వెంకటేష్ – ఇమేజ్ అనే చట్రం నుండి బయటకి రావాలి..

Published on Dec 13, 2012 4:35 PM IST

venkatesh
వినయ విధేయతలు కలిగిన వాడు, మంచి మనిషి, టాలెంట్ ఉన్న నటుడు మరియు ఫ్యామిలీ కి ఎంతో విలువనిచ్చే మనిషి ఇవన్నీ విక్టరీ వెంకటేష్ అనగానే ఇచ్చే స్టేట్మెంట్స్. ఏ రంగంలోనైనా మనకు పేరు ప్రఖ్యాతలు రావాలంటే విక్టరీ చాలా అవసరం అలాంటి విక్టరీని తన ఇంటి పేరుగా మార్చుకున్న హీరో విక్టరీ వెంకటేష్. ఈ రోజు ఆయన 52వ పుట్టిన రోజు. 1960 డిసెంబర్ 13న చెన్నైలో జన్మించిన వెంకీ 1986లో వచ్చిన ‘కలియుగ పాండవులు’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆయన బర్త్ డే సందర్భంగా వెంకీ మీడియా ప్రతినిధులతో కాసేపు ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో ఆయన తన కెరీర్ గురించి, తన రాబోయే సినిమాల గురించి అలాగే అందరూ ప్రపంచం అంతం అయిపోతుందనుకుంటున్న 2012 డిసెంబర్ 21 గురించి కూడా ఆయన మాట్లాడారు. ఆ విశేషాలు మీ కోసం…

ప్రశ్న) టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో నటిస్తున్నారు. మహేష్ బు తో కలిసి పనిచేయడం ఎలా ఉంది?

స) మహేష్ బాబు బాగా టాలెంట్ ఉన్న నటుడు, సెట్లో చేసే ప్రతి సీన్ కి 100% న్యాయం చేస్తాడు. తను చేసిన సీన్ ని ఒకటికి పది సార్లు చెక్ చేసుకుంటాడు. మహేష్ తో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. ఒకసారి షూటింగ్ అయిపొయింది అంటే వచ్చి అందరితో సరదాగా ఉంటాడు. సినిమా తీసున్నప్పుడు చాలా ఎక్కువగా విన్న మాట ఏమిటంటే ‘ మీరు నిజమైన అన్నదమ్ముల లాగానే ఉన్నారు’.

ప్రశ్న) షాడో సినిమాలో పూర్తి డిఫరెంట్ లుక్ తో కనపడుతున్నారు. సినిమా ఎలా తెరకెక్కుతోంది?

స) షాడో సినిమా యాక్షన్ ఎంటర్ టైనర్, నా పాత్ర డిమాండ్ చేయడంతో కొత్త లుక్ లో కనిపించానున్నాను. మెహర్ రమేష్ సినిమాని బాగా తీస్తున్నాడు. ఈ సినిమాలో యాక్షన్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉంటాయి కానీ మంచి డ్రామా కూడా ఉంటుంది. ఈ సినిమాని ప్రపంచంలోని పలు అందమైన లొకేషన్లలో తీస్తున్నాము, త్వరలోనే షూటింగ్ పూర్తవుతుంది.

ప్రశ్న) సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా కోసం శ్రీకాంత్ అడ్డాల మిమ్మల్ని ఎలా ఒప్పించాడు?

స) ముందుగా నేనొక విషయం చెప్పదలుచుకున్నాను ఏమిటంటే మనం ఇక ఇమేజ్ అనే చట్రం నుండి బయటకి రావాలి. గతంలో ఉన్న ఇమేజ్ నే దృష్టిలో పెట్టుకుంటే ముందుకు వెళ్ళలేము. అది వదిలేసి ముందు కొచ్చాను కాబట్టే ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ లాంటి సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీకాంత్ టాలెంట్ ఉన్న డైరెక్టర్ అతనికి ఏమి కావాలి, ఏది షూట్ చేయాలి అనేది బాగా తెలుసు. ఒక సినిమాలో ఇద్దరు పెద్ద హీరోలను సమానంగా చూపించడం చాలా కష్టం కానీ ఆ విషయంలో శ్రీకాంత్ సక్సెస్ అయ్యాడు.

ప్రశ్న) సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనుకున్న టైం కంటే కొంత ఆలస్యం అయ్యింది. దానికి కారణం ఏమిటి?

స) మన ఇండస్ట్రీలో చాలా మంది హీరోలున్నారు కానీ టాలెంట్ ఉన్న హీరోయిన్స్ , డైరెక్టర్స్ చాలా తక్కువ ఉన్నారు. దీనివల్ల ఇలాంటి పెద్ద సినిమాలు చేయాల్సినప్పుడు డేట్స్ ఇబ్బంది వస్తుంది. ఇది ఒకరి తప్పు అని అనలేం. ఇది తక్కువ మంది ఉన్న నటులకి ఎక్కువగా డిమాండ్ ఉండడమే తప్పని అనుకోవాలి.

ప్రశ్న) మీ కుమారుడు అర్జున్ ఫిల్మ్ కెరీర్ కోసం సిద్దమవుతున్నాడా?

స) అర్జున్ ఇంచా చిన్న కుర్రాడు. తనకి సినిమాలంటే ఇష్టం ఉంది కానీ అర్జున్ గుడ్ స్టూడెంట్. ప్రస్తుతం తన ఏకాగ్రత అంతా చదువు పైనే ఉంది. ఆ సమయం వచ్చినప్పుడు సినిమాల్లోకి రావాలా వద్దా అనేది తనే డిసైడ్ చేసుకుంటాడు.

ప్రశ్న) అందరూ 2012 డిసెంబర్ 21(డూమ్స్ డే ) గురించి మాట్లాడుకుంటున్నారు. దీని పై మీ స్పందన ఏమిటి?

స) (నవ్వుతూ) అది మనచేతుల్లో లేదండీ. అలాంటి వాటిని నేను పట్టించుకోను. బతికినంత కాలం మంచిగా ఉండటం మరియు ప్రశాంతమైన నిద్ర లాంటివి మాత్రమే మనచేతుల్లో ఉంటాయి. అలాంటి విషయాల గురించి ఎక్కువగా భయపడకండి.

ప్రశ్న) ‘కృష్ణం వందే జగద్గురుమ్’ సినిమాలో రానాతో కలిసి మీరు స్టెప్పు లేయడం చూడటానికి చాలా బాగుంది. మీరిద్దరూ కలిసి ఎప్పుడు సినిమా చేస్తున్నారు?

స) తనతో కలిసి ఓ సినిమా చేయాల్సి ఉంది, దాని కోసం ఓ మంచి కథ కోసం చూస్తున్నాం. ఇప్పటి వరకూ కొన్ని కాన్సెప్ట్స్ విన్నాము కానీ ఏదీ ఓకే చెయ్యలేదు. మేము అనుక్కున్న స్థాయిలో కథ వస్తే ఖచ్చితంగా కలిసి సినిమా చేస్తాము.

ప్రశ్న) మీరు భవిష్యత్తులో ఎలాంటి పాత్రలు చేయాలనుకుంటున్నారు?

స) ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక నటుడిగా నేను చేయాల్సిన పాత్రలు ఇంకా ఉన్నాయని నేను భావిస్తున్నాను. ఉదాహరణకి సచిన్ నే తీసుకోండి ప్రస్తుతం అతను రిటైర్మెంట్ ఇవ్వాలని అందరూ అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు తను ఒక సెంచురీ చేస్తే తను ఇండియా టీంకి చాలా అవసరం అని టీంలో ఉండాలని అంటారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా అలానే ఉంటుంది హీరోగా ఎన్ని ఫ్లాప్స్ ఇచ్చినా ఒక్క హిట్ ఇస్తే అతను టాక్ అఫ్ ది టౌన్ గా మారుతాడు.

నాకొచ్చే పాత్రలకు నేను ఎప్పటివరకూ న్యాయం చేయగలనో అప్పటివరకూ నటిస్తాను. ప్రస్తుతం రామ్ తో కలిసి ‘బోల్ బచ్చన్’ రిమేక్ లో కలిసి నటించనున్నాను. అలాగే నా డ్రీం ప్రాజెక్ట్ వివేకానంద స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యింది. ఇలాగే ఆసక్తికరమైన సినిమాలు మునుముందు చేయాలనుకుంటున్నాను.

ప్రశ్న) మీ హెల్త్ యొక్క సీక్రెట్ ఏమిటి?

స) యోగా. యోగా మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. నేను ఇదే విషయాన్ని నా ఫ్రెండ్స్ కి, అసోషియేట్స్ కి చెబుతుంటాను. ఒక సింపుల్ యోగాసనం మనలో ఎన్నో ఊహించని మార్పులను తెస్తుంది. మీరూ ట్రై చెయ్యండి.

తను ఇలాగే మంచి మంచి సినిమాలు చేస్తూ, హ్యాపీ గా లైఫ్ సాగించాలని కోరుకుంటూ వెంకటేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపాము. అంతటితో మా చిట్ చాట్ ముగించాము. ఈ ఇంటర్వ్యూని మీరు కూడా బాగా ఎంజాయ్ చేసారని అనుకుంటున్నాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు