‘రోబో-2’ ఆడియో ఈవెంట్ కోసం రూ. 12 కోట్ల ఖర్చు !
Published on Oct 8, 2017 3:09 pm IST


సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులతో పాటు దక్షిణాది సినీ ప్రేక్షకులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా ‘రోబో-2’. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుని ప్రస్తుతం విఎఫ్ఎక్స్ పనులను జరుపుకుంటోంది. భారీ వ్యయంతో నిర్మితమవుతున్న ఈ సినిమా డియో వేడుక దుబాయ్ లో జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రమోషన్లు చేపడుతున్న నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ అక్టోబర్ 27న జరగనున్న ఈ కార్యక్రమం కోసం ఔరా అనే స్థాయిలో డబ్బు వెచ్చిస్తోంది.

తమిళ సినీ వర్గాల సమాచారం మేరకు ఈ మొత్తం సుమారు రూ.12 కోట్ల రూపాయలుగా ఉండనుందట. చెన్నై, ముంబై నుండి చిత్ర ముఖ్య టీమ్, అతిధుల కోసం ప్రత్యేకంగా రెండు చార్టెడ్ ఫ్లైట్లను ఏర్పాటు చేశారట. అంతేగాక వేదిక వద్ద కూడా కళ్ళు చెదిరే స్థాయిలో ఏర్పాట్లు చేయనున్నారట. కేవలం ఆడియో వేడుకే ఇంత గ్రాండ్ లెవెల్లో ఉంటే సినిమా ఇంకెంత గొప్ప స్థాయిలో ఉంటుందో అర్థమవుతోంది. ఏ.ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ చేసే అవకాశాలున్నాయి.

 
Like us on Facebook