కోడింగ్ లేకుండానే AI యాప్ డిజైన్: 13 ఏళ్ల అమ్మాయి వినూత్న ఆలోచనతో భారీ ఆదాయం!

కోడింగ్ లేకుండానే AI యాప్ డిజైన్: 13 ఏళ్ల అమ్మాయి వినూత్న ఆలోచనతో భారీ ఆదాయం!

Published on Sep 1, 2026 10:00 PM IST

సాంకేతిక పరిజ్ఞానంపై సరైన అవగాహన ఉంటే వయసుతో సంబంధం లేకుండా ఫలితాలు సాధించవచ్చని నిరూపించింది ఓ 13 ఏళ్ల బాలిక. కోడింగ్ తెలియకపోయినా కృత్రిమ మేధ (AI) సాయంతో సరికొత్త స్టడీ యాప్‌ను రూపొందించి కేవలం మూడు రోజుల్లోనే సుమారు రూ.2.5 లక్షల మేర ఆదాయం ఆర్జించింది.

చైనాకు చెందిన జు షుహాన్ అనే విద్యార్థిని ‘జై చాంగ్’ (Zai Chang) పేరుతో ఒక AI స్టడీ అసిస్టెంట్ యాప్‌ను తయారు చేసింది. ఉద్యోగాల్లో తీరిక లేకుండా ఉండే తల్లిదండ్రులు తమ పిల్లల చదువులను దూరం నుంచే పర్యవేక్షించేందుకు, విద్యార్థులు హోంవర్క్ చేసే సమయంలో మొబైల్ వాడకుండా శ్రద్ధ పెట్టేందుకు ఈ యాప్ తోడ్పడుతుంది.

వర్చువల్ పేరెంట్‌గా పర్యవేక్షణ

తల్లిదండ్రుల ఫొటోను యాప్‌లో అప్‌లోడ్ చేస్తే అది వర్చువల్ రూపంలో మారి పిల్లల కదలికలను గమనిస్తుంది. చదువుకునే సమయంలో విద్యార్థి మొబైల్ ఫోన్ వాడుతున్నా లేదా సీటు వదిలి వెళ్లినా కెమెరా ద్వారా గుర్తించి వెంటనే హెచ్చరిస్తుంది. అలాగే స్టడీ షెడ్యూల్స్ సిద్ధం చేయడం, క్లిష్టమైన నోట్స్‌ను సులభతరం చేయడం వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

హాంగ్‌జౌలో ఇటీవల నిర్వహించిన జాతీయ స్థాయి AI ప్రొడక్ట్ మార్కెటింగ్ పోటీలో జు షుహాన్ పాల్గొంది. మొత్తం 50 మంది పాల్గొన్న ఈ ఈవెంట్‌లో ఎవరు ఎక్కువ ఆదాయం ఆర్జిస్తే వారినే విజేతలుగా నిర్ణయించారు. తన యాప్ విక్రయాల ద్వారా 18,000 యువాన్లు (సుమారు రూ. 2.5 లక్షలు) సాధించిన ఆమె, అదనంగా 5,000 యువాన్ల మూడో బహుమతిని కూడా గెలుచుకుంది. స్పష్టమైన ఆలోచన ఉంటే AI సాధనాల ద్వారా దానిని సులభంగా ఆచరణలోకి తీసుకురావచ్చని ఈ సందర్భంగా ఆమె పేర్కొంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు