Tata Tiago 2026: కేవలం రూ.4.69 లక్షలకే.. కళ్లుచెదిరే ఫీచర్లు, సీఎన్‌జీలోనూ ఏఎంటీ గేర్‌బాక్స్‌తో లాంచ్!

కొత్త కారు కొనాలనుకునే వారికి దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన ‘టాటా టియాగో’ సరికొత్త రూపుదిద్దుకుని మార్కెట్లోకి వచ్చేసింది. అద్భుతమైన డిజైన్, ఆకట్టుకునే ఫీచర్లతో 2026 టాటా టియాగోతో పాటు దాని ఎలక్ట్రిక్ వెర్షన్ ‘టియాగో ఈవీ’ని కంపెనీ గ్రాండ్‌గా లాంచ్ చేసింది. మారుతీ స్విఫ్ట్, హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వడమే లక్ష్యంగా టాటా ఈ కొత్త కారును రంగంలోకి దించింది.

సామాన్యుడి బడ్జెట్‌లో ధరలు

కొత్త టియాగో ధరల విషయంలో టాటా మోటార్స్ కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. పెట్రోల్ వేరియంట్ ప్రారంభ ధర రూ.4.69 లక్షలుగా నిర్ణయించగా, ఐ-సీఎన్‌జీ (iCNG) వేరియంట్ ధర రూ.5.79 లక్షల నుంచి మొదలవుతుంది.

ఎలక్ట్రిక్ కార్లను సామాన్యులకు మరింత చేరువ చేసే క్రమంలో టాటా ఒక వినూత్న స్కీమ్‌ను తెరపైకి తెచ్చింది. అదే BaaS (బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్). ఈ ఆప్షన్ ఎంచుకుంటే టియాగో ఈవీని పెట్రోల్ కారు ధరకు, అంటే కేవలం రూ.4.69 లక్షలకే ఇంటికి తీసుకెళ్లొచ్చు. కాకపోతే, బ్యాటరీ అద్దె కింద కిలోమీటరుకు రూ. 2.6 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ కారును పూర్తిగా సొంతం చేసుకోవాలనుకుంటే టియాగో ఈవీ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.6.99 లక్షలుగా ఉంటుంది.

ప్రీమియం లుక్.. కళ్లుచెదిరే ఫీచర్లు

2026 మోడల్‌లో టాటా భారీగానే మార్పులు చేసింది. ముందు భాగంలో కొత్త బంపర్, కనుబొమ్మల ఆకారంలో ఉండే ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, కొత్త డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్ కారుకు మంచి స్పోర్టీ లుక్ తీసుకొచ్చాయి. ఇంటీరియర్ విషయానికొస్తే క్యాబిన్‌ను బ్లాక్, లైట్ గ్రే కలర్ థీమ్‌తో డిజైన్ చేశారు. 10.25 అంగుళాల ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఇల్యూమినేటెడ్ టాటా లోగోతో కూడిన 2-స్పోక్ స్టీరింగ్ వీల్ లాంటివి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. వీటితో పాటు డ్యూయల్ వైర్‌లెస్ ఛార్జర్, 360 డిగ్రీల కెమెరా, బ్లైండ్ స్పాట్ మానిటర్, రియర్ ఏసీ వెంట్స్ లాంటి లగ్జరీ ఫీచర్లను కూడా ఈ కారులో పొందుపరిచారు. భద్రతకు పెద్దపీట వేస్తూ అన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లను స్టాండర్డ్‌గా ఇస్తున్నారు.

మైలేజ్, రేంజ్, ఇంజిన్ పవర్

టియాగో ఈవీ రెండు బ్యాటరీ ఆప్షన్లతో (19.2 kWh, 24 kWh) కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది. సింగిల్ ఛార్జ్‌తో ఇవి వరుసగా 205 కి.మీ, 215 కి.మీల వాస్తవ రేంజ్ ఇస్తాయని కంపెనీ చెబుతోంది. దీనిలో 30kW DC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటం వల్ల కేవలం 18 నిమిషాలు ఛార్జ్ చేస్తే చాలు, 100 కి.మీల మేర ప్రయాణించవచ్చు.

ఇక పెట్రోల్ మోడల్ 1.2-లీటర్ ఇంజిన్‌తో 86 hp పవర్‌ను జనరేట్ చేస్తుంది. ఇక్కడ కస్టమర్లను ఆకర్షించే మరో పాయింట్ ఏంటంటే.. ఆటోమొబైల్ హిస్టరీలోనే తొలిసారిగా ఒక సీఎన్‌జీ హ్యాచ్‌బ్యాక్ కారులో 5-స్పీడ్ ఏఎంటీ (AMT) గేర్‌బాక్స్‌తో పాటు ప్యాడిల్ షిఫ్టర్స్‌ను టాటా పరిచయం చేసింది. ఆటోమెటిక్ కార్లను ఇష్టపడే సీఎన్‌జీ కస్టమర్లకు ఇది నిజంగా పెద్ద అడ్వాంటేజ్.

Exit mobile version