
అలనాటి సావిత్రి తన భర్త ప్రాణాల కోసం యముడితో పోటి పడింది. ఇక తెలుగు తెరపై హీరోయిన్ సావిత్రి.. తన నటనతో అభిమానుల హృదయాలలో చెరగని ముద్ర వేసింది. ఎటు చూసిన ‘సావిత్రి’ అనే పేరుకు ఉన్న వేల్యూ చాలా ఎక్కువే. ఇదే టైటిల్ తో సినిమా తీస్తే ఆ క్రేజే వేరు. అందువల్ల దర్శకనిర్మాతలు ఈ టైటిల్ కోసం పోటి పడుతున్నారు.
సంచలన దర్శకులు రామ్ గోపాల్ వర్మ ‘సావిత్రి’ అనే పేరుతో సినిమా తెరకెక్కిస్తున్నట్టు ఈ రోజు ప్రకటించారు. హాట్ హాట్ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు. అయితే, ‘సావిత్రి’ అనే టైటిల్ హక్కులు తమ వద్ద ఉన్నాయని నిర్మాత నీలిమ తిరుమల శెట్టి చెప్పారు. నారా రోహిత్ హీరోగా పవన్ సాధినేని దర్శకత్వంలో నిర్మించబోయే సినిమా కోసం ‘సావిత్రి’ అనే టైటిల్ నిర్ణయించినట్టు తెలిపారు.
మొదట ఫిల్మ్ చాంబర్ లో సురేష్ బాబు ‘సావిత్రి’ టైటిల్ ను రిజిస్టర్ చేయించారు. వారి అనుమతితో ఆ టైటిల్ ను మేము తీసుకోవడం జరిగిందని నీలిమ తిరుమల శెట్టి తెలిపారు. ఇదే టైటిల్ ను రామ్ గోపాల్ వర్మ వాడుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యింది.
గతంలో చాలా సినిమాలకు ఇలానే టైటిల్ విషయంలో సమస్యలు ఏర్పడ్డాయి. అప్పుడు దర్శకనిర్మాతలు, హీరోలు టైటిల్ ముందు తమ పేరు వేసుకుని వివాదానికి ముగింపు పలికారు. ఇప్పుడు ‘సావిత్రి’ ఎలా మారుతుందో..?