
అవకాశం వస్తే రాజమౌళితో తప్పకుండా ఒక సినిమా చేస్తాను. నాకు వ్యక్తిగతంగా అతను తెలుసు. చాలా ప్రతిభావంతుడు. అని అన్నారు ప్రముఖ హిందీ నటుడు అమీర్ ఖాన్. ‘3 ఇడియట్స్’ తర్వాత రాజ్ కుమార్ హిరాణి దర్శకత్వంలో అమీర్ నటించిన సినిమా ‘పీకే’. డిసెంబర్ 19న విడుదలవుతుంది. ఈ సినిమా ప్రచార కార్యక్రమాలలో భాగంగా హైదరాబాద్ విచ్చేసిన అమీర్ ఖాన్ మీడియా సమావేశంలో రాజమౌళి గురించి పైవిధంగా స్పందించారు.
‘మగధీర’, ‘ఈగ’ సినిమాల తర్వాత రాజమౌళి పేరు జాతీయ స్థాయిలో మారుమ్రోగింది. మన తెలుగు దర్శకుడి ప్రతిభ అందరికీ తెలిసింది. ఇండియాలో అగ్ర స్థాయి నటులు రాజమౌళితో సినిమా చేయాలని కోరుకుంటున్నారు. నిన్న సాయంత్రం జరిగిన ‘లింగ’ కర్టెన్ రైజర్ కార్యక్రమంలో కూడా రజనీకాంత్ ఇదే తరహా కోరిక వ్యక్తం చేశారు. రాజమౌళితో సినిమా చేయాలనుందని చెప్పారు.
ప్రస్తుతం ‘బాహుబలి’ సినిమా గురించి తప్ప మరో సినిమా గురించి కలలో కూడా రాజమౌళి ఆలోచించడం లేదు. భారి అంచనాలు నెలకొన్న ఈ సినిమా విడుదలైన తర్వాత రాజమౌళి ఎలాంటి సినిమా రూపొందించడానికి సన్నాహాలు చేస్తారో..? ఎవరితో చేస్తారో..?