‘బాహుబలి’ తర్వాత ఆ స్థాయి గ్రాఫిక్స్‌తో రానున్న ‘పులి’

Puli
తమిళ సినీ పరిశ్రమలో ఈ ఏడాది అత్యంత ప్రతిష్టాత్మక సినిమాగా చెప్పబడుతోన్న సినిమా ‘పులి’. ఇలయదళపతి విజయ్ హీరోగా రూపొందిన ఈ భారీ బడ్జెట్ సినిమాపై అంతటా విపరీతమైన అంచనాలున్నాయి. 100 కోట్లకు పైనే బడ్జెట్‌తో తెరకెక్కడం, నటి శ్రీదేవి చాలా కాలం తర్వాత సౌతిండియన్ సినిమాలో కనిపించనుండడం, విజయ్ కెరీర్లో నిలిచిపోయే సినిమాగా ప్రచారం జరుగుతూండడం లాంటి విశేషాలన్నీ ఈ సినిమాకు తమిళ నాట ఒక ప్రత్యేకతను తెచ్చిపెట్టాయి.

ఇక ఇండియన్ సినిమా స్థాయిని ప్రపంచానికి చాటిచెప్పిన ‘బాహుబలి’ కోవలోనే ఈ సినిమా హై రేంజ్ గ్రాఫిక్స్‌తో రూపొందింది. సుమారు 2600 వీఎఫ్‌ఎక్స్ షాట్స్‌తో ఈ సినిమా కనులవిందు చేయనుంది. బాహుబలి తర్వాత ఈ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్‌తో వస్తోన్న సినిమా పులి కావడం విశేషం. తమిళంతో పాటు తెలుగులోనూ మంచి క్రేజున్న ఈ సినిమాకు సంబంధించిన తెలుగు వర్షన్ హక్కులను ఎస్‌వీఆర్ మీడియా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తమిళంతో పాటు, తెలుగులోనూ సెప్టెంబర్ 17న పెద్ద ఎత్తున ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలూ చివరిదశకు చేరుకున్నాయి.

ఇక నిన్న రిలీజైన ‘పులి’ తమిళ ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండ్ సృష్టిస్తోంది. తెలుగు వర్షన్ ట్రైలర్‌ను ఈ సాయంత్రం (ఆగష్టు 21) సంతోషం సినీ అవార్డ్స్ కార్యక్రమంలో విడుదల చేయనున్నారు. తెలుగు ట్రైలర్‌కు కూడా ఇదే స్థాయి రెస్పాన్స్ ఉంటుందని సినిమా యూనిట్ భావిస్తోంది. విజయ్ సరసన శృతి హాసన్, హన్సికలు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు చింబు దేవన్ దర్శకుడు. సుధీప్ విలన్‌గా నటించారు.

Exit mobile version