టాలీవుడ్‌లో 2026 సంక్రాంతి బరిలో పలు ఇంట్రెస్టింగ్ చిత్రాలు రిలీజ్ అయ్యాయి. ఈ సినిమాల్లో హీరో నవీన్ పొలిశెట్టి లీడ్ రోల్‌లో నటించిన ‘అనగనగా ఒక రాజు’ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. మారి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అందాల భామ మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో, చిత్ర బృందం థ్యాంక్స్ మీట్ నిర్వహించింది.
ఈ కార్యక్రమంలో నిర్మాత నాగ వంశీ మాట్లాడుతూ.. “ఆరు సంవత్సరాల తర్వాత ఈ సంక్రాంతి నాకు అత్యంత సంతృప్తిని ఇచ్చింది. దీనికి కారణం అనగనగా ఒక రాజు మూవీనే. అల్లు అర్జున్‌తో చేసిన ‘అల వైకుంఠపురములో’ తర్వాత సంక్రాంతికి ఆ స్థాయి విజయం మాకు రాలేదు. గత సంవత్సరం సాంకేతికంగా అద్భుతమైన సినిమా (డాకు మహారాజ్) తీసినా, డిస్ట్రిబ్యూటర్లకు ఆశించిన స్థాయిలో లాభాలు రాలేదు. కానీ ఈసారి అనగనగా ఒక రాజుతో మేము నిజంగా రాక్ చేశాం” అని అన్నారు.
తనను ఎల్లప్పుడూ ఆదరిస్తున్న ప్రేక్షకులకు, మీడియాకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. గత కొన్ని నెలల్లో తమ సినిమాలు (కింగ్డమ్, మాస్ జాతర) ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. ఈసారి మాత్రం అగ్ర నిర్మాతలు తమకు మద్దతుగా నిలిచారు. వారి ప్రోత్సాహం తనకు చాలా ఆనందాన్ని ఇచ్చిందని ఆయన చెప్పారు.


