రామ్ హీరోగా ‘శివమ్’ పేరుతో ఓ హై వోల్టేజ్ లవ్‌స్టోరీ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా అక్టోబర్ 2న పెద్ద ఎత్తున విడుదలకు సిద్ధమవుతోంది. పండగ చేస్కో లాంటి మంచి విజయం తర్వాత రామ్ హీరోగా నటించిన సినిమా కావడంతో శివమ్‌పై మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఈమధ్యే విడుదలైన సినిమా ఆడియో, ట్రైలర్‌కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా దేవిశ్రీ ప్రసాద్ అందించిన ఆడియోలోని కొన్ని పాటలు అంతటా మారుమోగిపోతున్నాయి.
కాగా ఆడియో సక్సెస్‌తో మంచి జోరు మీదున్న ‘శివమ్’ యూనిట్ ప్రస్తుతం సినిమాను ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్ళేందుకు సరికొత్త ప్రమోషనల్ కార్యక్రమాలతో ముందుకు వచ్చింది. హీరో రామ్, హీరోయిన్ రాశిఖన్నాలు రేపట్నుంచి స్వయంగా ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాలు పంచుకోనున్నారు. హైద్రాబాద్, వైజాగ్, విజయవాడల్లోని పలు ప్రముఖ షాపింగ్ మాల్స్‌లో రామ్, రాశిఖన్నాలు శివమ్ ప్రమోషన్స్ చేయనున్నారు. రామ్ సొంత బ్యానర్ అయిన స్రవంతి మూవీస్ పతాకంపై ఈ సినిమా రూపొందింది. స్రవంతి రవికిషోర్ నిర్మాతగా పెద్ద ఎత్తున తెరకెక్కిన ఈ సినిమా ద్వారా శ్రీనివాస్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్న విషయం తెలిసిందే!


