విడుదల తేదీ : జూలై 10, 2026
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
నటీనటులు : అజయ్ దేవగన్, రితేష్ దేశ్‌ముఖ్, అర్షద్ వార్సి, జావేద్ జాఫేరి, రవి కిషన్, సంజయ్ మిశ్రా, ఉపేంద్ర లిమాయే, అంజలి ఆనంద్ షేక్, సంజీద షేక్ తదితరులు
దర్శకత్వం : ఇంద్ర కుమార్
నిర్మాతలు : అజయ్ దేవగన్, భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, అశోక్ ఠాకేరియా, ఇంద్ర కుమార్, ఆనంద్ పండిట్, కుమార్ మంగత్ పాఠక్
సంగీతం : తనిష్క్ బాగ్చీ, ఆదిత్య దేవ్, నీల్‌కమల్ సింగ్, సంజు రాథోడ్, గురు రంధావా (పాటలు), అమర్ మోహిలే (బ్యాక్‌గ్రౌండ్ స్కోర్)
ఛాయాగ్రహణం : సుధీర్ కుమార్ చౌదరి
కూర్పు: సంజయ్ సంక్లా
సంబంధిత లింక్స్ : ట్రైలర్
బాలీవుడ్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ కామెడీ ఫ్రాంచైజీల్లో ఒకటిగా గుర్తింపు తెచ్చుకున్న ‘ధమాల్’ సిరీస్ నుండి ఇప్పుడు నాలుగో భాగం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ తారాగణంతో క్రేజీ అడ్వెంచర్ రైడ్‌గా తెరకెక్కిన ఈ ‘ధమాల్ 4’ సినిమా థియేటర్లలో ఏ మేరకు నవ్వించిందో సమీక్షలో చూద్దాం.
కథ:
ఈ సినిమా కథ అంతా శైతాన్ సింగ్ అనే వ్యక్తి వందేళ్ల క్రితం దాచిపెట్టిన గుప్త నిధి చుట్టూ తిరుగుతుంది. ఈ నిధి ఎక్కడుందో తెలిపే మ్యాప్ వివరాలు కేవలం పృథ్వీ (ఉపేంద్ర లిమాయే)కి మాత్రమే తెలుస్తాయి. దీంతో ఎలాగైనా ఆ సంపదను దక్కించుకోవాలని పైరేట్ లీడర్ అధూరా (రవి కిషన్) పృథ్వీ వెంట పడతాడు. మరోవైపు ఎలాగైనా బిలియనీర్లు అయిపోవాలని గుడ్డూ (అజయ్ దేవగన్), ఆది (అర్షద్ వార్సి), మానవ్ (జావేద్ జాఫేరి), లల్లన్ (రితేష్ దేశ్‌ముఖ్), పారో (అంజలి ఆనంద్), రోజీ (సంజీద షేక్) కూడా ఈ నిధి వేటలోకి ఎంట్రీ ఇస్తారు. ఈ క్రమంలో ఈ గ్యాంగ్స్ మధ్య జరిగిన గందరగోళం ఏంటి? చివరికి ఆ నిధి ఎవరికి దక్కింది? అనేదే మిగతా సినిమా.
ప్లస్ పాయింట్స్:
సినిమా కథలో పెద్దగా కొత్తదనం లేకపోయినా, మొదటి భాగం మాత్రం మంచి వినోదాన్ని అందిస్తుంది. ట్రైలర్ చూసినప్పుడే ఇది లాజిక్‌తో సంబంధం లేని ఒక పక్కా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్ అని అర్థమైపోతుంది. దానికి తగ్గట్టే దర్శకుడు ఫస్ట్ హాఫ్‌లో మంచి ఫన్ జనరేట్ చేశారు.
ముఖ్యంగా ఇంటర్వెల్‌కు ముందు వచ్చే క్లిఫ్ సీక్వెన్స్ (అందరూ కొండ అంచున వేలాడుతూ నిధి గురించి చర్చించుకునే సీన్) సినిమాకే హైలైట్‌గా నిలుస్తుంది. అలాగే జావేద్ జాఫేరి అమాయకత్వంతో ప్రతిసారీ సంజీద షేక్‌ను గాయపరిచే సీన్స్ థియేటర్లలో నవ్వులు పూయిస్తాయి. అజయ్ దేవగన్, సంజయ్ మిశ్రాల దెయ్యం ఎపిసోడ్ కూడా బాగానే పేలింది. నటీనటుల విషయానికి వస్తే.. అజయ్ దేవగన్, రితేష్ దేశ్‌ముఖ్, అంజలి ఆనంద్ తమ కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నారు. మిగిలిన వారంతా తమ పాత్రల పరిధి మేర చక్కగా నటించారు.
మైనస్ పాయింట్స్:
ఫస్ట్ హాఫ్‌లో మెప్పించిన ఈ చిత్రం.. సెకండ్ హాఫ్‌కు వచ్చేసరికి ఆ వేగాన్ని అందుకోలేకపోయింది. ద్వితీయార్ధంలో కథ పూర్తిగా అడ్వెంచర్, నిధి వేట వైపు షిఫ్ట్ అవ్వడంతో కామెడీ డోస్ చాలా వరకు తగ్గిపోయింది. వచ్చే కొన్ని నవ్వులు తెప్పించే సన్నివేశాలు కూడా ఆశించిన స్థాయిలో పండలేదు.
సినిమా ముందుకు సాగుతున్న కొద్దీ స్క్రిప్ట్‌లో బలం తగ్గినట్లు అనిపిస్తుంది. నిధి వేటకు సంబంధించిన ఎపిసోడ్స్ పెద్దగా ఎగ్జైట్‌మెంట్‌ను కలిగించవు. ఈ భాగంలో కథనాన్ని మరింత ఆసక్తికరంగా రాసుకోవాల్సింది. రైటింగ్ లో లోపాలు స్పష్టంగా కనిపించడం వల్ల సీన్లు ఊహాజనితంగా మారిపోయాయి, దాంతో పేసింగ్ కూడా నెమ్మదించింది. కొన్ని సీన్లు రిపీటెడ్‌గా అనిపించడంతో పాటు సినిమాలో మంచి పాటలు పడకపోవడం కూడా మైనస్ అయింది.
సాంకేతిక వర్గం:
సాంకేతిక పరంగా చూస్తే.. ప్రసిద్ధ ఇటాలియన్ సాంగ్ ‘బెల్లా చావో’ రీక్రియేషన్ బాగుంది, కానీ మిగతా పాటలు అంతగా గుర్తుండవు. అమర్ మోహిలే అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా మూడ్‌కు తగ్గట్టుగా సాగింది. సుధీర్ కుమార్ చౌదరి సినిమాటోగ్రఫీ విజువల్స్ పరంగా రిచ్‌గా ఉంది.
ఇక విఎఫ్ఎక్స్ (VFX) కొన్ని చోట్ల పర్వాలేదనిపించినా, మరికొన్ని కీలక సన్నివేశాలలో గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్ స్పష్టంగా తెలిసిపోతుంది. దర్శకుడు ఇంద్ర కుమార్ మేకింగ్ ఓకే అనిపించినా, సెకండ్ హాఫ్‌ను మరింత బాగా హ్యాండిల్ చేసి ఉంటే సినిమా రేంజ్ వేరేలా ఉండేది. క్లైమాక్స్‌లో ఇచ్చిన చిన్న ఎమోషనల్ టచ్ పర్వాలేదు.
తీర్పు:
ధమాల్ ఫ్రాంచైజీ అనగానే ప్రేక్షకులు ఆశించే రేంజ్ అవుట్ అండ్ అవుట్ క్రేజీ కామెడీ, అన్‌లిమిటెడ్ మ్యాడ్నెస్ ఈ నాలుగో భాగంలో కొంత కరువయ్యాయి. ప్రథమార్ధంలో వచ్చే కొన్ని ఎంటర్‌టైనింగ్ సీన్స్, నటీనటుల కామెడీ టైమింగ్ సినిమాను కాస్త నిలబెట్టే ప్రయత్నం చేసినా.. ద్వితీయార్ధంలో కథనం పూర్తిగా గాడి తప్పింది. సెకండ్ హాఫ్‌లో నిధి వేట చుట్టూ సాగే అడ్వెంచర్ సీన్లు ఏమాత్రం ఎగ్జైట్‌మెంట్‌ను కలిగించకపోగా, బోరింగ్ ట్రీట్‌మెంట్‌తో సినిమా గ్రాఫ్‌ను బాగా పడేశాయి.
ఫస్ట్ హాఫ్‌లో పండిన కొద్దిపాటి కామెడీ కోసం, నటీనటుల పర్ఫార్మెన్స్ కోసం లాజిక్స్ అస్సలు వెతక్కుండా థియేటర్‌లో ఒకసారి అలా కూర్చోవాలి అనుకుంటేనే ఈ చిత్రం ఓకే అనిపిస్తుంది. అంతకు మించి ఈ క్రేజీ ఫ్రాంచైజీ నుండి భారీగా ఆశించి వెళ్తే మాత్రం నిరాశ తప్పదు.
123telugu.com Rating: 2.75/5
Reviewed by 123telugu Team
