క్లైమాక్స్ ఫైట్ షూట్‌లో అఖిల్ సినిమా!

క్లైమాక్స్ ఫైట్ షూట్‌లో అఖిల్ సినిమా!

Published on Aug 12, 2015 11:24 PM IST

akhil-akkineni
అక్కినేని వంశంలో మూడో తరం నుంచి హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేందుకు అక్కినేని అఖిల్ సిద్ధమవుతున్న విషయం తెలిసిందే! ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్, అఖిల్‌ను పరిచయం చేసే బాధ్యతను చేపట్టారు. వినాయక్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాను శ్రేష్ట్ మూవీస్ పతాకంపై హీరో నితిన్ నిర్మించడం విశేషం. ఇప్పటికే స్పెయిన్, హైద్రాబాద్, థాయ్ ల్యాండ్‌లలో భారీ ఎత్తున షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాకు సంబంధించిన క్లైమాక్స్ ఫైట్ షూటింగ్ నిన్ననే సంఘీ ఫారెస్ట్‌లో మొదలైంది.

క్లైమాక్స్ ఫైట్ కోసమే వేసిన ఓ ప్రత్యేక సెట్‌లో ఆగష్టు 23వరకు ఈ షూటింగ్ జరగనుంది. వి.వి.వినాయక్ పెద్ద ఎత్తున ఈ ఫైట్‌ను ప్లాన్ చేశారు. ఇక ఫైట్‌తో సినిమా టాకీ పార్ట్ దాదాపుగా పూర్తి కానుందని తెలుస్తోంది. ఇక మిగిలి ఉన్న పాటల కోసం వచ్చే నెలలో సినిమా యూనిట్ యూరప్ వెళ్ళనుంది. అఖిల్ సినిమాపై మొదట్నుంచీ భారీ అంచనాలే ఉండగా, ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా రూపొందుతున్నట్లు నితిన్, వి.వినాయక్ చెబుతూ వస్తున్న విషయం తెలిసిందే! దసరా కానుకగా అక్టోబర్ 21న విడుదల కానున్న ఈ సినిమాలో సయేష్ హీరోయిన్‌గా నటిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు