
ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ తనయుడిగా సినీరంగ ప్రవేశం చేసి అతి తక్కువ కాలంలోనే తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అల్లరి నరేష్. వరుస హాస్యకథా చిత్రాలతో మెప్పిస్తూ, రాజేంద్ర ప్రసాద్ తర్వాత తెలుగులో ఆ స్థానాన్ని భర్తీ చేశారు. తాజాగా ఈ అల్లరోడు పెళ్ళి పీటలెక్కేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. చెన్నైకి చెందిన విరూపతో ఈమధ్యే నిశ్చితార్థం కాగా ఈ నెల 29న వివాహం జరగనుంది.
హైద్రాబాద్‌లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో గ్రాండ్‌గా ఈ పెళ్ళి వేడుక జరగనుంది. ఇక ఈ వేడుక సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి చేసే పనిలో అల్లరి నరేష్ కుటుంబ సభ్యులు మునిగిపోయారు. అల్లరి నరేష్ తన అన్నయ్య ఆర్యన్ రాజేష్‌తో కలిసి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులను స్వయంగా వివాహ వేడుకకు ఆహ్వానిస్తున్నారు. ఈ ఉదయం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి ఆయనను వివాహ వేడుకకు ఆహ్వనించారు. ఇక పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల మధ్య వైభవంగా ఈ పెళ్ళి వేడుకను జరపనున్నారు.

