
అల్లరి నరేష్ సినిమాలంటే కామెడీకి ఓ సరికొత్త బ్రాండ్. కామెడీని తనదైన స్టైల్లో ప్రెజెంట్ చేస్తూ, తన బ్రాండ్‌ను మరింత పెంచుకుంటూ వచ్చిన నరేష్ గత కొద్దికాలంగా ఎదురుచూస్తూ వచ్చిన సక్సెస్ జేమ్స్ బాండ్ సినిమాతో దక్కడంతో మళ్ళీ బిజీ బిజీగా మారిపోయారు. సక్సెస్ ఇచ్చిన ఊపులో కలెక్షన్ కింగ్ మోహన్ బాబుతో కలిసి ‘మామ మంచు అల్లుడు కంచు’ అన్న పేరుతో రూపొందుతోన్న కామెడీ సినిమాను ఇప్పటికే విడుదలకు సిద్ధం చేసేసి తాజాగా మరో కొత్త సినిమాను కూడా మొదలుపెట్టేశారు.
అల్లరి నరేష్ గతంలో చేసిన సిద్ధు ఫ్రమ్ సికాకుళం అన్న సినిమాతో పరిచయమైన ఈశ్వర్ రెడ్డి దర్శకత్వంలో అల్లరి నరేష్ కొత్త సినిమా నిన్ననే సెట్స్‌పైకి వెళ్ళింది. గతంలో పాపులర్ బ్యానర్‌గా పేరు తెచ్చుకున్న గోపీ ఆర్ట్స్ పతాకంపై ఈ సినిమా నిర్మితమవుతోంది. ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర ఈ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా కోసం ఈశ్వర్ అల్లరి నరేష్ స్టైల్లో సాగిపోయే ఓ ఎంటర్‌టైనర్ కథను సిద్ధం చేశారని తెలుస్తోంది.