
విలక్షణ నటనతో ఎలాంటి పాత్రనైనా రక్తికట్టించగల నటుడు ప్రకాశ్ రాజ్, ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే! ‘కాంజివరం’ లాంటి మంచి సినిమాను అందించిన కాంబినేషన్లో మరో సినిమా రానుండడంతో ఈ సినిమాపై ప్రీ ప్రొడక్షన్ దశనుంచే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా ఈ సినిమా విషయంలో మరొక ఆసక్తికర విషయం వచ్చి చేరి సినిమాపై మరింత అంచనాలు పెంచుతున్నాయి.
తెలుగు, తమిళ భాషల్లో నటిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ అమలా పాల్ ఈ సినిమాకు నిర్మాత కావడం ఆసక్తికరంగా కనిపిస్తోంది. ఎయిడ్స్ నేపథ్యంలో ఓ సీరియస్ అంశంగా కనిపించే సినిమా అయినా ఈ సినిమాను ప్రియదర్శన్, తనకు బాగా అలవాటైన కామెడీ టచ్‌తో ఆలోచింపదగ్గ సినిమాగా తెరకెక్కించనున్నారట. దేశంలో ప్రఖ్యాతి గాంచిన టెక్నీషియన్స్ అయిన సంతోష్ శివన్, సబు శిరిల్లు ఈ సినిమాకు పనిచేయనుండడం విశేషం. ప్రకాష్ రాజ్ సరసన ఈ సినిమాలో శ్రేయా రెడ్డి హీరోయిన్గా కనిపించనుంది.
చాలాకాలం క్రితం నుండే సినిమా నిర్మాణం దిశగా ఆలోచన చేస్తూ ఉన్న అమలా పాల్, థింక్ బిగ్ స్టూడియోస్ అనే సంస్థను నెలకొల్పి తన మొదటిసినిమానే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కే సినిమాను నిర్మిస్తున్నారు. ప్రతిదీ పెద్దగా ఆలోచించాలని ప్రతిబింబించే బ్యానర్లో వస్తోన్న ఈ సినిమా అమలా పాల్‌కు నిర్మాతగానూ మంచి సక్సెస్‌ను తెచ్చిపెడుతుందని ఆశిద్దాం.