
బుల్లితెర ప్రేక్షకులను తెగ నవ్వించి తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన సీరియల్ ‘అమృతం’. ఈ సీరియల్ రూపకర్త గుణ్ణం గంగరాజు అమృతం సీరియల్ కి కొనసాగింపుగా వెండితెరపై చేసిన ప్రయత్నమే ‘అమృతం-చందమామలో’. ఈ సినిమా విశేషాలను, విడుదల తేదీని తెలియజేయడానికి గుణ్ణం గంగరాజు మీడియాతో ముచ్చటించారు.
గుణ్ణం గంగరాజు మాట్లాడుతూ ‘ సీరియల్ ని సినిమాగా తీయడం చాలా అరుదు. కానీ మేము అనుకున్న చందమామలో కాన్సెప్ట్ సీరియల్ కి సరిపోదని, అలాగే ఖర్చు ఎక్కువ అవుతుందని సినిమాగా తీసాం. అమృతం సీరియల్ లోని అంశాలేవీ ఇందులో ఉండవు, కేవలం అందులో నటించిన పాత్రలు మాత్రమే ఉంటాయి. ఈ సినిమా కోసం ఒక్కో స్పేస్ సూట్ కోసం 35 వేలు ఖర్చు పెట్టి 25 సూట్స్ తయారు చేసామని’ అన్నాడు.
అలాగే మాట్లాడుతూ ‘పోస్ట్ ప్రొడక్షన్ కోసం ఎక్కువ టైం పట్టింది. ఇసిఎస్ కంపెనీ చేసిన 30 నిమిషాల గ్రాఫిక్స్, రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ, శ్రీ మ్యూజిక్ స్పెషల్ అట్రాక్షన్ అవుతుంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో మే 9న వస్తున్న ఈ సినిమా వెండితెర ప్రేక్షకులను మెప్పించి హిట్ అవుతుందని’ నమ్మకంగా ఉందని అన్నారు.