‘అమూల్’ కొత్త యాడ్‌లో ‘బాహుబలి’యే హీరో!

‘అమూల్’ కొత్త యాడ్‌లో ‘బాహుబలి’యే హీరో!

Published on Jul 21, 2015 12:11 PM IST

baahubali-amul

దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన బాహుబలి సినిమా గురించి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జూలై 10న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైన ఈ సినిమా సృష్టిస్తోన్న రికార్డులు అన్నీ ఇన్నీ కావు. దేశవ్యాప్తంగా అన్ని చోట్లా మారుమోగిపోయిన బాహుబలి అన్న పేరు సినీ చర్చల దశను దాటి ఎప్పుడో సాధారణ చర్చల్లోకి కూడా వచ్చి చేరింది. భారతదేశంలోని ప్రఖ్యాత పాల ఉత్పత్తుల సంస్థ అయిన అమూల్ కొత్త ప్రచార కథనం ఈ విషయాన్ని మళ్ళీ ఋజువుచేసింది.

‘బహుత్ బట్టర్‌లి’ అన్న శీర్షికతో అమూల్ విడుదల చేసిన ఈ కొత్త యాడ్‌లో ప్రభాస్‌కు, హీరోయిన్ తమన్నా వెన్నను అందిస్తూ ఉన్నట్లుగా ఓ కార్టూన్ తయారు చేశారు. కార్టూన్ చివర్న ‘అమూల్ మాసివ్ హిట్’ అన్న చిన్న శీర్షికను చేర్చి ఇటు ‘బాహుబలి’ సినిమాకు తమ గౌరవాన్ని ప్రకటిస్తూనే, అటు తమ సంస్థ ఉత్పత్తులకు కూడా సరికొత్త ప్రచారాలు కల్పించారు. ఈ మధ్య కాలంలో ఒక సినిమాకు సంబంధించిన పాత్రల గురించి దేశవ్యాప్తంగా మాట్లాడుకోవడం చాలా తక్కువ సందర్భాల్లోనే జరగగా, ‘బాహుబలి’ తాజాగా ఆ లిస్ట్‌లో చేరడం విశేషంగా కనిపిస్తోంది.

ఇక హిందీ వర్షన్‌లో బాహుబలి పది రోజుల్లో ఏకంగా 60 కోట్ల రూపాయలు కొల్లగొట్టి రికార్డు సృష్టించింది. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను ఆర్కా మీడియా వర్క్స్ నిర్మించింది.

తాజా వార్తలు