విజయ్ దేవరకొండ ‘లైగర్’ సినిమాతో తీవ్రంగా నిరాశపరిచిన బాలీవుడ్ నటి అనన్య పాండే, తాజాగా ‘చాంద్ మేరా దిల్’ అనే ప్రేమకథా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘కిల్’ సినిమా హీరో లక్ష్య లాల్వాని ఇందులో హీరోగా నటించగా, ప్రముఖ బాలీవుడ్ మేకర్ కరణ్ జోహార్ తన ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మించాడు. ఇక ఈ సినిమాలో పెద్ద సర్ప్రైజ్ ఏంటంటే, ఈ హిందీ సినిమా కథ మొత్తం మన హైదరాబాద్‌లోనే జరుగుతుంది.
అయితే, ఈ సినిమాలో అనన్య పాండే చేసిన ఒక భరతనాట్యం సీన్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతోంది. ఆమె చేసిన విచిత్రమైన స్టెప్పులు, గెంతులు ప్రాచీన నాట్య కళను నవ్వులపాలు చేసేలా ఉన్నాయంటూ నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ వివాదాస్పద సీన్ వల్ల హీరోయిన్‌తో పాటు దర్శకుడు వివేక్ సోని కూడా నెగటివిటీని ఎదుర్కొంటున్నాడు.
ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద యావరేజ్ రివ్యూలు వచ్చాయి. దీంతో వీకెండ్ కలెక్షన్లు రూ.15 కోట్లు కూడా దాటలేదు. కాలేజీ లవ్ స్టోరీగా వచ్చిన ఈ సినిమా వసూళ్లు మెల్లగా పుంజుకుంటాయని చిత్ర యూనిట్ భావిస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న డాన్స్ క్లిప్ వల్లే ఈ సినిమాకు ఎక్కువ అటెన్షన్ లభిస్తుండటం గమనార్హం.


