వెర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ కెరీర్‌లో తన 15వ చిత్రాన్ని తాజాగా ప్రారంభించారు. త్రిశూల్ విజినరీ స్టూడియోస్ బ్యానర్‌పై బి.నరేంద్ర రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి లక్ష్మినారాయణ పుట్టంచెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ కంప్లీట్ ఎంటర్‌టైనర్‌లో ‘జాతిరత్నాలు’ ఫేమ్ ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తోంది. హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో జరిగిన పూజా కార్యక్రమాలకు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ముఖ్య అతిథిగా విచ్చేసి, తొలి షాట్‌కు క్లాప్ కొట్టారు. యంగ్ ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి కెమెరా స్విచ్ ఆన్ చేయగా, లక్ష్మినారాయణ పుట్టంచెట్టి గౌరవ దర్శకత్వం వహించారు.
ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి మాట్లాడుతూ.. ‘నా స్నేహితుడు నరేంద్ర నిర్మిస్తున్న ఈ సినిమా సత్యదేవ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఎంటర్‌టైనర్ అవుతుందని ఆశిస్తున్నా. అలాగే, దర్శకుడు లక్ష్మినారాయణకు ఈ చిత్రం మంచి గుర్తింపు తెస్తుందని టీమ్ అందరికీ నా అభినందనలు’ అని తెలిపారు.
దర్శకుడు లక్ష్మినారాయణ మాట్లాడుతూ.. ‘ఇది అందరినీ కడుపుబ్బ నవ్వించే పక్కా ఎంటర్‌టైనర్. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించబోతున్నాం. రామ్ మిరియాల అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నారు.’ అని అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ రామ్ మిరియాల మాట్లాడుతూ.. ‘సత్య అన్నతో పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికే రెండు పాటల కంపోజిషన్ పూర్తయింది. ఈ సినిమా పాటలు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తాయి.’ అని అన్నారు.


