రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘టాక్సిక్’ ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు సార్లు డేట్లు మార్చుకున్న ఈ చిత్రం, చివరిగా అనుకున్న జూన్ 4 డేట్‌ను కూడా వదిలేసింది. నిర్మాత ఆశిస్తున్న రేటులో ఓటీటీ కంపెనీలు కేవలం 30 నుండి 40 శాతమే ఆఫర్ చేయడంతో బిజినెస్ డీల్స్ తెగకనే రిలీజ్ వాయిదా పడుతోందని బెంగళూరు టాక్.
నిజానికి జూన్ రిలీజ్ అనుకుని యష్ ఏప్రిల్‌లోనే ఇంటర్వ్యూలు ఇచ్చాడు. కానీ వాయిదా పడటంతో పబ్లిసిటీ ఆపేసి, డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్‌తో కలిసి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ అయ్యాడు. ప్రస్తుతం యష్ తరచూ బయట కనిపిస్తున్నా ‘టాక్సిక్’ రిలీజ్ డేట్ ప్రస్తావన రాకుండా జాగ్రత్త పడుతున్నాడు. నయనతార, కియారా అద్వానీ లాంటి భారీ తారాగణం ఉన్నప్పటికీ సరైన అప్‌డేట్స్ లేకపోవడంతో జనంలో సినిమాపై పెద్దగా బజ్ లేదు.
ఈ సినిమాను నిర్మిస్తున్న కేవీఎన్ సంస్థకు రీసెంట్‌గా ‘కేడీ’ సినిమా నిరాశపరిచింది. ‘టాక్సిక్’ టీజర్లు కూడా ఆశించిన హైప్ తేలేకపోయాయి కాబట్టి ఇప్పుడు ఒక మైండ్ బ్లోయింగ్ ట్రైలర్ అవసరం. నవంబర్‌లో యష్ ‘రామాయణ’ విడుదల కానుంది. కాబట్టి దానికంటే కనీసం మూడు నెలల ముందైనా ‘టాక్సిక్’ రావాలి. లేదంటే ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాదికి షిఫ్ట్ అయ్యే రిస్క్ ఉంది.
