స్వర్గీయ శ్రీ అక్కినేని నాగేశ్వరరావు, జయసుధ, తులసి నటీనటులుగా 1982లో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో ‘ప్రతిబింబాలు’ షూటింగ్ ప్రారంభించారు నిర్మాత జాగర్లమూడి రాధాకృష్ణమూర్తి. 6 పాటలు, కొంత టాకీ పార్ట్ షూటింగ్ పూర్తయిన తర్వాత సింగీతం శ్రీనివాసరావుకు కన్నడ సినిమా అవకాశం రావడంతో మధ్యలో ఈ సినిమాను వదిలేశారు. సినిమా ఆగిపోయింది. తర్వాత ఏయన్నార్ సలహాతో కె.ఎస్.ప్రకాశరావు దర్శకత్వంలో మిగతా సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభించారు నిర్మాత. 1991లో షూటింగ్ మొత్తం పూర్తయింది. 2007లో సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేశారు. వచ్చే నెలలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
అక్కినేని నటించిన ప్రేమ నగర్, ప్రేమాభిషేకం, దసరా బుల్లోడు తరహాలో ‘ప్రతిబింబాలు’ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కుటుంబ విలువలతో వినోదాత్మకంగా తెరకెక్కించిన సినిమా ఇది. చక్రవర్తి సంగీతం, ఆత్రేయ మాటలు, వేటూరి పాటలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. అక్కినేని నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. అక్టోబర్ లో సినిమాను విడుదల చేస్తున్నాం అని నిర్మాత నిర్మాత జాగర్లమూడి రాధాకృష్ణమూర్తి తెలిపారు.
సినిమా షూటింగ్ ప్రారంభమైన 32 ఏళ్ళ తర్వాత ‘ప్రతిబింబాలు’ విడుదల కానుండడం విశేషం. ఆర్ధిక సమస్యలు, నిర్మాణంతర కార్యక్రమాలు నత్త నడకన సాగడంతో లేటుగా విడుదల చేస్తున్నామని నిర్మాత చెప్పారు.


