పుకార్లను కొట్టిపడేసిన అనుష్క!

పుకార్లను కొట్టిపడేసిన అనుష్క!

Published on Nov 23, 2015 8:58 PM IST

anushka
తెలుగు, తమిళ భాషల్లో నటిగా తనదైన బ్రాండ్ సృష్టించుకున్న అనుష్క, తాజాగా ‘సైజ్ జీరో’ సినిమా కోసం ఓ పెద్ద సాహసాన్నే చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం ఏకంగా 15 కేజీలకు పైనే బరువు పెరిగి నటనపై, సినిమాలపై తనకున్న మక్కువను చూపుకున్నారు. ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందిన ఈ సినిమా మరో ఐదురోజుల్లో థియేటర్లలో సందడి చేయనుంది. పీవీపీ సంస్థ నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళంలో ఒకేసారి నవంబర్ 27న భారీ ఎత్తున విడుదల కానుంది.

ఇక ఈ సందర్భంగా ‘సైజ్ జీరో’ టీమ్ ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది. అనుష్క కూడా ప్రచారాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇక ఈ సినిమా కోసం బరువు పెరగడం తనకు సినిమాలపై ఉన్న ఇష్టంతోనే చేశానని తెలిపారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం తన తదుపరి సినిమా ‘బాహుబలి ది కంక్లూజన్’ కోసం మళ్ళీ అనుష్క బరువు తగ్గే పనిలో పడ్డ విషయం తెలిసిందే. ఇక బరువు తగ్గడం కోసం అనుష్క అమెరికాకు సర్జరీ కోసం వెళ్ళారనే పుకార్లు వినిపిస్తోన్న నేపథ్యంలో ఈ విషయంపై స్పందిస్తూ.. “ఇవన్నీ ఎక్కణ్ణుంచి పుట్టుకొస్తాయో నాకైతే అర్థం కావట్లేదు. నేను ఎలాగైతే సహజ పద్ధతుల్లో బరువు పెరిగానో, అలాగే సహజ పద్ధతుల్లోనే బరువు తగ్గుతున్నా. మరి నేను సర్జరీ చేయించుకుంటున్నట్లు పుకార్లు ఎలా పుట్టాయో నాకైతే తెలీదు” అంటూ ఆ పుకార్లను కొట్టిపడేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు