
‘హీరోయిన్ అంటే సినిమాల్లో ఓ చిన్న అదనపు పాత్ర మాత్రమే’ అనే అభిప్రాయాలున్న సమయంలోనే హీరోయిన్‌గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి అనుష్క. ‘అరుంధతి’, ‘వేదం’, ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’ లాంటి సినిమాలతో తనదైన బ్రాండ్ సృష్టించుకున్న అనుష్క మరో సరికొత్త ప్రయోగం ‘సైజ్ జీరో’తో మనముందుకు రానున్న విషయం తెలిసిందే. ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా కోసం అనుష్క అసాధారణ రీతిలో బరువు పెరగడంతో పాటు మళ్ళీ తగ్గారు.
ఇక ఒక పాత్ర కోసం అనుష్క ఇంత సాహసానికి ఒడికట్టడం అంతటా విశేషంగా కనిపించింది. ఫస్ట్‌లుక్ పోస్టర్‌తోనే విపరీతమైన అంచనాలను పెంచేసిన ఈ సినిమా, నేడు విడుదలైన టీజర్‌తో మరింతగా ఆకర్షిస్తోంది. ముఖ్యంగా బొద్దుగా మారి కనిపిస్తోన్న అనుష్క స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగా ఆకట్టుకుంటోంది. ఇక ఒక్క డైలాగ్ కూడా లేకుండా సినిమా ఫీల్‌ను తెలిపేలా టీజర్ రూపొందింది. చివరి షాట్‌లో అనుష్క ఎక్స్‌ప్రెషన్స్ కట్టిపడేసేలా ఉన్నాయనే చెప్పాలి. పీవీపీ సంస్థ తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల కానున్న ఈ సినిమాలో ఆర్య హీరోగా నటించారు. సెప్టెంబర్ 6న ఆడియో రిలీజ్ కానుండగా, సెప్టెంబర్‌లో సినిమా విడుదల కానుంది.