ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎఫ్డీసీ) నూతన పాలకవర్గ ప్రమాణస్వీకారోత్సవం విజయవాడలో జరిగింది. ఈ కార్యక్రమానికి సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏపీ ఎఫ్డీసీ చైర్మన్‌గా భరత్ భూషణ్, సభ్యులుగా సుమన్ తల్వార్, ఝాన్సీ, మెహర్ రమేష్, సాయిమాధవ్ బుర్రా, కందిమల్ల సాంబశివరావు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏపీలో సినీ, టీవీ, నాటక రంగాల అభివృద్ధికి తమవంతు కృషి చేస్తామని నూతన సభ్యులు స్పష్టం చేశారు.
సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో సినిమా షూటింగ్‌లకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, నిలిచిపోయిన నంది అవార్డులను పునఃప్రారంభించే దిశగా అడుగులు వేస్తున్నామని వెల్లడించారు. నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. ఏపీ నుంచి సినీ రంగానికి భారీగా ఆదాయం వస్తోందని, ఇక్కడి అందమైన లొకేషన్లలో షూటింగ్‌లు సజావుగా జరిగేలా ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. థియేటర్ల మూసివేతను అరికట్టి, ఆ వ్యవస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
అమరావతిలో కొత్త స్టూడియోతో పాటు రాష్ట్రవ్యాప్తంగా థియేటర్ల నిర్మాణానికి కృషి చేస్తామని దర్శక నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు తెలిపారు. తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి, మా అసోసియేషన్ సహా 24 క్రాఫ్ట్స్‌కు చెందిన పలువురు సినీ ప్రముఖులు, పంపిణీదారులు ఈ వేడుకలో పాల్గొని నూతన ఎఫ్డీసీ బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
