
దర్శకుడు రాజమౌళి రూపొందించిన విజువల్ వండర్ ‘బాహుబలి’ ఓ పక్క రికార్డుల మోత మోగిస్తూనే, మరోపక్క సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపర రంగ ప్రముఖుల చేత మన్ననలు పొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా అభిమానుల జాబితాలో పలువురు ప్రముఖులు చేరిపోగా తాజాగా ఆ లిస్ట్‌లోకి తన మ్యూజిక్ మ్యాజిక్‌ను హాలీవుడ్‌కు సైతం వ్యాపింపిజేసి ఆస్కార్ అవార్డు కొల్లగొట్టిన ఏ.ఆర్. రెహమాన్ చేరిపోయారు. ‘బాహుబలి’ సినిమాపై రెహమాన్ ప్రశంసల వర్షం కురిపించారు.
“లైఫ్ ఆఫ్ పై తర్వాత నన్ను ఆ స్థాయిలో ఆకర్షించి థియేటర్‌కు రప్పించిన సినిమా ఇండియన్ మాస్టర్‌పీస్ ‘బాహుబలి’. సినిమా చూశాక మంచి అనుభూతి కలిగింది. ఇక మనం ఇలాంటి సినిమాలు ఇంకా చాలా చేయగలం అనే నమ్మకాన్ని బాహుబలి కల్పించింది” అంటూ బాహుబలి సినిమాపై రహమాన్ ప్రశంసలు కురిపించారు. ఇక దేశం గర్వించదగ్గ సంగీత దర్శకుడి దగ్గర్నుంచి ఈ స్థాయి అభినందనలు దక్కడం పట్ల రాజమౌళి ఆనందం వ్యక్తం చేశారు. “మీ అబినందనలు మాకు మళ్ళీ కొత్త ఎనర్జీనిచ్చాయి. ఈ ఉత్సాహంతో ఇంకా బాగా పనిచేస్తాం” అంటూ రహమాన్ అభినందనలకు ప్రతిస్పందనగా రాజమౌళి ట్వీట్ చేశారు.

