చిరు ‘రాక్షసుడు’కి, సూర్య ‘రాక్షసుడు’కి సంబంధం ఏంటి?

Rakshasudu-First-Look

మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో ‘రాక్షసుడు’ సినిమాకు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. కోదండరామి రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 1986లో విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడదే టైటిల్‌తో తమిళంతో పాటు తెలుగులోనూ స్టార్ స్టేటస్‌ను కొట్టేసిన సూర్య మన ముందుకు రానున్న విషయం తెలిసిందే. తమిళంలో ‘మాస్’ పేరుతో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులో ‘రాక్షసుడు’ పేరుతో విడుదల చేస్తున్నారు. దర్శకుడు వెంకట్ ప్రభు సినిమా కథకు ‘రాక్షసుడు’ అనే టైటిల్ సరిగ్గా సరిపోతుందని ఆ పేరును ఖరారు చేశారు.

కాగా ఆ పేరుతో చిరంజీవి సూపర్ హిట్ సినిమా ఇంతకుముందే విడుదలై ఉండడంతో, టైటిల్ మారిపోతుందనే టాక్ వినిపించింది. అయితే చిరు ‘రాక్షసుడు’ సినిమా దర్శకుడు కోదండరామి రెడ్డి సూర్యకు బాగా తెలిసిన వ్యక్తి కావడంతో, సూర్య కోరిక మేరకు ‘రాక్షసుడు’ అనే టైటిల్ పెట్టుకోవడానికి ఏ ఇబ్బందులు కలగకుండా చూశారట కోదండరామి రెడ్డి. ఇక ఈ మధ్యే జరిగిన ఆడియో ఆవిష్కరణ వేడుకకు కోదండరామి రెడ్డి హాజరై తన తరపున శుభాకాంక్షలు కూడా తెలియజేశారు.

చిరు రాక్షసుడు సినిమాకు, సూర్య రాక్షసుడు సినిమాకూ టైటిల్ విషయంలో తప్ప ఎక్కడా సంబంధం లేదని దర్శకుడు తెలిపారు. సూర్య రాక్షసుడు ఓ సరికొత్త కథాంశంతో తెరకెక్కిన సూపర్‌న్యాచురల్ థ్రిల్లర్ అని తెలిపారు. ఇక ఫస్ట్‌లుక్‌తోనే విపరీతమైన ఆసక్తి పెంచేసిన ఈ సినిమాపై ట్రైలర్‌ విడుదల తర్వాత అంచనాలు తారాస్థాయికి చేరిపోయాయి. ఇక భారీ అంచనాల మధ్య ఈ సినిమా మే 29న తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల కానుంది.

Exit mobile version