సమీక్ష: బ్లాస్ట్ జోన్ – డీసెంట్ యాక్షన్ అండ్ ఫన్

సమీక్ష: బ్లాస్ట్ జోన్ – డీసెంట్ యాక్షన్ అండ్ ఫన్

Published on May 28, 2026 4:55 PM IST

Blast Zone Review

విడుదల తేదీ : మే 28, 2026

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు : యాక్షన్ కింగ్ అర్జున్, ప్రీతి ముకుందన్, అభిరామి తదితరులు
దర్శకుడు : సుభాష్ కె రాజ్
నిర్మాత : ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్
సంగీతం : రవి బస్రూర్
సినిమాటోగ్రఫీ : అరుణ్ రాధాకృష్ణన్
ఎడిటర్ : ప్రదీప్ ఇ రాఘవ్

సంబంధిత లింక్స్ : ట్రైలర్

యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా, అభిరామి, ప్రీతి ముకుందన్ కీలక పాత్రల్లో నటించిన యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘బ్లాస్ట్ జోన్’. తమిళంలో ‘బ్లాస్ట్’గా తెరకెక్కిన ఈ చిత్రం, ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ యాక్షన్ రైడ్ ఏ మేరకు ఆకట్టుకుందో సమీక్షలో చూద్దాం.

కథ :

అర్జున్, ఆయన భార్య అభిరామి, కూతురు నీల (ప్రీతి ముకుందన్).. చూడ్డానికి ఇదొక సాధారణ కుటుంబంలా అనిపిస్తుంది. కానీ, వీళ్ల ప్రత్యేకత ఏంటంటే ఈ ముగ్గురూ కరాటే మాస్టర్లే. చిన్నప్పటి నుంచే కూతురు నీలను చాలా ధైర్యంగా పెంచుతారు. సాఫీగా సాగిపోతున్న వీరి జీవితంలోకి ఒక బిజినెస్ మ్యాన్, ఓ లోకల్ గూండాతో ఊహించని గొడవ వస్తుంది. అసలు ఆ రౌడీలకి ఈ ఫ్యామిలీకి మధ్య ఏం జరిగింది? ఈ కరాటే ఫ్యామిలీ ఆ గూండాలను ఎలా ఎదుర్కొంది? అన్నదే మిగతా కథ.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాలో అర్జున్, అభిరామి, ప్రీతి ముకుందన్ పాత్రలను డిజైన్ చేసిన తీరు అద్భుతంగా ఉంటుంది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా ఇందులో ఇద్దరు బలమైన మహిళా పాత్రలు కనిపిస్తాయి. కూతురి ప్రవర్తన చూసి భయపడే సాధారణ గృహిణిగా కనిపించే అభిరామి, తన ఫ్యామిలీ కష్టాల్లో ఉన్నప్పుడు రౌడీల ఎముకలు విరగ్గొట్టే సీన్ రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తుంది. ఇంటర్వెల్ లో ఆమె ట్రాన్స్‌ఫర్మేషన్ సీన్ కు థియేటర్లో కచ్చితంగా విజిల్స్ పడతాయి.

మరోవైపు ప్రీతి ముకుందన్ పాత్ర యువతులకు బాగా కనెక్ట్ అవుతుంది. ఆఫీస్ లో వేధింపులను తను ఒంటరిగా ఎదుర్కొనే సీన్ లో యాక్షన్ తో పాటు మంచి ఫన్ కూడా జెనరేట్ అవుతుంది. తన పాత్రకి ఆమె పూర్తి న్యాయం చేసింది. ఇక యాక్షన్ కింగ్ అర్జున్ తన స్టైల్, స్క్రీన్ ప్రెజెన్స్ తో అదరగొట్టాడు. కరాటే మాస్టర్ గా ఆ పాత్రను ఆయన చాలా ఎంజాయ్ చేస్తూ చేశాడు.

సినిమాకు యాక్షన్ బ్లాక్స్ ప్రాణం పోశాయి. చుట్టుపక్కల వాళ్లకి ఏమాత్రం అనుమానం రాకుండా ఈ ఫ్యామిలీ ఇంట్లో రౌడీలను ఇరగబాదే తీరుని దర్శకుడు చాలా స్మార్ట్ గా హ్యాండిల్ చేశాడు. యాక్షన్ మాత్రమే కాకుండా సందర్భానుసారంగా వచ్చే ఫన్ ప్రేక్షకులను బాగా నవ్విస్తుంది.

మైనస్ పాయింట్స్ :

దర్శకుడు సినిమా ప్రపంచాన్ని, పాత్రలను పరిచయం చేయడానికి ఫస్ట్ హాఫ్‌లో కాస్త ఎక్కువ సమయం తీసుకున్నాడు. ఈ ఎపిసోడ్స్ కాస్త నెమ్మదిగా సాగినట్లు అనిపిస్తాయి. వాటిని ఇంకాస్త ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది.

అలాగే, ఈ సినిమా బేసిక్ స్టోరీ లైన్ చాలా రొటీన్ గా ఉంటుంది. ఇప్పటికే ఇలాంటి ఫార్మాట్ లో చాలా సినిమాలు వచ్చాయి. కేవలం క్రేజీ క్యారెక్టరైజేషన్స్‌తో దర్శకుడు ఈ కథను నడిపించాడు. కాబట్టి కొత్తదనం ఆశించే వారు కాస్త నిరాశపడొచ్చు. ఫస్ట్ హాఫ్ లో విలన్లతో వచ్చే కొన్ని సీన్స్ అంతగా కన్విన్సింగ్ గా అనిపించవు.

సాంకేతిక విభాగం :

మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కొన్ని బ్లాక్‌బస్టర్ సినిమాలను గుర్తుచేసినా, సెకండాఫ్ లో మాత్రం చాలా బాగుంది. అరుణ్ రాధాకృష్ణన్ కెమెరా వర్క్ యాక్షన్ సీక్వెన్స్‌లకి చాలా ప్లస్ అయింది. నిర్మాణ విలువులు ఉన్నతంగా ఉన్నాయి. ప్రదీప్ ఎడిటింగ్ సెకండాఫ్ లో చాలా స్మూత్ గా సాగింది. దర్శకుడు సుభాష్ కె రాజ్ రొటీన్ కథనే ఎంచుకున్నా, దాన్ని ప్రజెంట్ చేసిన విధానం మెప్పిస్తుంది.

తీర్పు:

ఓవరాల్ గా ‘బ్లాస్ట్ జోన్’.. అద్భుతమైన యాక్షన్ ఎపిసోడ్స్, ఫన్, పవర్‌ఫుల్ క్యారెక్టర్స్‌తో ఆకట్టుకునే యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్‌టైనర్. కథలో కొత్తదనం లేకపోవడం, ఫస్ట్ హాఫ్ కాస్త నెమ్మదిగా సాగడం చిన్న మైనస్. కానీ సెకండాఫ్ లో ఉండే టైట్ స్క్రీన్‌ప్లే ప్రేక్షకులను చివరి దాకా కూర్చోబెడుతుంది. అర్జున్, అభిరామి, ప్రీతి ముకుందన్ తమ నటనతో సినిమాను నిలబెట్టారు. యాక్షన్ సినిమాలు ఇష్టపడేవారు కచ్చితంగా ఈ చిత్రాన్ని ఓసారి చూడొచ్చు.

123telugu.com Rating: 3/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు