
సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ స్టార్ హీరోస్ తో మరియు భారీ బడ్జెట్ సినిమాల్లో నటిస్తున్న టాప్ హీరోయిన్ అనుష్క. ఈ యోగా బ్యూటీ నటించిన రెండు లేడీ ఓరియెంటెడ్ సినిమా ‘సైజ్ జీరో’. ఇప్పటి వరకూ స్లిమ్ అండ్ హాట్ హాట్ గా కనిపించిన అనుష్క ‘సైజ్ జీరో’లో అందరినీ ఆశ్చర్య పరిచేలా బాగా బొద్దుగా కనిపించనుంది. ఈ సినిమా కోసం అనుష్క అమాంతం 20 కేజీలు బరువు పెరిగింది. ఇంత రిస్క్ తీసుకొని చేసిన సైజ్ జీరో సినిమాకి అనుష్క ఏ మాత్రం రెమ్యునరేషన్ తీసుకోకుండా సినిమాని పూర్తి చేయడమే కాకుండా అసలు రెమ్యునరేషన్ వద్దని చెప్పిందని ఇటీవలే తెలియజేశాం.
ఇప్పుడు అనుష్క బాటలోనే ఈ సినిమాలో హీరోగా నటించిన ఆర్య కూడా నడిచాడు. ఆర్య సైజ్ జీరో కి ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోనని, తనకి ఎలాంటి అమౌంట్ ఇవ్వక్కర్లేదని ఈ చిత్ర టీంకి తెలిపినట్లు సమాచారం. ఇలా సినిమాకి హీరో – హీరోయిన్ అయిన ఆర్య- అనుష్కలు అసలు రెమ్యునరేషన్ తీసుకోకుండా కేవలం కథ మీద ప్రేమతో ఈ సినిమాని చేయడం విశేషం. పివిపి బ్యానర్ పై పరమ్ వి పొట్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాకి రాఘవేంద్ర రావు తనయుడు ప్రకాష్ కోవెల మూడి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో ఆర్య, అనుష్క లతో పాటు సోనాల్ చౌహాన్ మరో హీరోయిన్ గా కనిపించనుంది.
శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్న ఈ సినిమా ఆడియోని సెప్టెంబర్ 6న రిలీజ్ చేసి, సినిమాని అక్టోబర్ 2న రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాకి ఎంఎం కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్.