
‘అష్టా చమ్మా’.. దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణకు ఓ మంచి గుర్తింపు తెచ్చిపెట్టడంతో పాటు, నాని, అవసరాల శ్రీనివాస్‌లను సినీ పరిశ్రమకు పరిచయం చేసిన సినిమా. ‘అష్టా చమ్మా’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నాని, ఆ తర్వాత అనతికాలంలోనే వరుస హిట్లతో స్టార్ హీరో స్టేటస్‌ను సొంతం చేసుకున్నారు. ఈ మధ్యే విడుదలైన ‘భలే భలే మగాడివోయ్’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం నమోదు చేసిన నాని, ప్రస్తుతం 14రీల్స్‌లో చేస్తోన్న సినిమా అయిపోగానే ‘అష్టా చమ్మా’ కాంబినేషన్‌ను మళ్ళీ సెట్ చేయనున్నారు.
ఇక ఈ కాంబినేషన్ గురించి రకరకాల ఊహాగానాలు వినిపించినా ఇప్పటివరకూ ఏదీ ఫైనల్ కాలేదు. కాగా తాజాగా ఈ కాంబినేషన్లో సినిమాకు సంబంధించిన తాజా అప్‌డేట్స్ మళ్ళీ అష్టా చమ్మా కాంబినేషన్‌కు రూట్ క్లియర్ చేశాయి. ప్రస్తుతం స్క్రిప్ట్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమాను మోహన కృష్ణ డిసెంబర్ నెలలో సెట్స్‌పైకి తీసుకెళ్ళనున్నట్లు తెలుస్తోంది. ఆదిత్య 369 లాంటి క్లాసిక్ సినిమాను నిర్మించిన కృష్ణ ప్రసాద్ నాని-మోహనకృష్ణల సినిమాను నిర్మించనున్నారు. అష్టా చమ్మా సినిమా విజయంలో కీలక పాత్ర పోషించిన అవసరాల శ్రీనివాస్ ఈ సినిమాలోనూ నటించనుండడం విశేషంగా చెప్పుకోవచ్చు.

