‘ఫైటర్ శివ’ టీజర్ లాంచ్ చేసిన నిర్మాత అశ్వనీదత్

Ashwini Dutt

కౌండిన్య ప్రొడక్షన్స్, అరుణ గిరి ఆర్ట్స్ బ్యానర్ల మీద ఉన్నం రమేష్, నర్సింహ గౌడ్ నిర్మించిన చిత్రం ‘ఫైటర్ శివ’. ప్రభాస్ నిమ్మల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మణికాంత్, ఐరా బన్సాల్ జంటగా నటించారు. ఈ మూవీలో సునీల్, వికాస్ వశిష్ట వంటి వారు కీలక పాత్రలను పోషించారు. ఈ క్రమంలో శనివారం (ఆగస్ట్ 16) నాడు ‘ఫైటర్ శివ’ టీజర్‌ను లాంచ్ చేశారు. ఈ టీజర్‌ను ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ రిలీజ్ చేశారు.

ఈ సందర్భంగా హీరో మణికాంత్ మాట్లాడుతూ.. ‘నన్ను హీరోని చేయాలని ఈ ‘ఫైటర్ శివ’ కోసం మా నాన్న గారు చాలా కష్టపడ్డారు. పెట్టిన ప్రతీ రూపాయిని వడ్డీతో సహా ఇండస్ట్రీ నుంచి తీసుకు వెళ్తాను. ఈ ప్రయాణం అంత సులభంగా జరగలేదు. మధ్యలో ఇరుక్కుపోయిన మమ్మల్ని రమేష్ గారు ఒడ్డుకు తీసుకు వచ్చారు. ప్రభాస్ గారికి కమర్షియల్ చిత్రాలంటేనే చాలా ఇష్టం. ఇందులోని ప్రతీ డైలాగ్ అద్భుతంగా ఉంటుంది. మా విశ్వ గారు సినిమా కోసం చాలా కష్టపడ్డారు. సురేందర్ గారి ప్రతీ ఫ్రేమ్ అద్భుతమనే చెప్పాలి. గౌతమ్ గారు ఇచ్చిన సంగీతం అందరినీ ఆకట్టుకుంటుంది. ‘ఫైటర్ శివ’ అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది’ అని అన్నారు.

దర్శకుడు ప్రభాస్ నిమ్మల మాట్లాడుతూ.. ‘అశ్వనీదత్, సంపత్ నంది గారి వల్లే ఈ ‘ఫైటర్ శివ’ ఇక్కడి వరకు వచ్చింది. మా మూవీ పోస్టర్‌ను సంపత్ నంది గారు, టీజర్‌ను అశ్వనీదత్ గారు రిలీజ్ చేసినందుకు థాంక్స్. ఓ సందేశాత్మకంగా చిత్రంగా ‘ఫైటర్ శివ’ను తెరకెక్కించాం. టైటిల్ రోల్‌లో మణికాంత్ నటించారు. సునీల్ గారు, వికాస్ వశిష్ట వంటి వారు ముఖ్య పాత్రల్ని పోషించారు. రిలీజ్ టైంలో అయినా ఆర్టిస్టులు ప్రమోషన్స్‌కి సహకరిస్తే బాగుంటుంది. గౌతమ్ సంగీతం అద్భుతంగా వచ్చింది. విశ్వనాథ్ ఎడిటింగ్ బాగా కుదిరింది. అందరి సహకారం వల్లే అవుట్ పుట్ బాగా వచ్చింది. నర్సింహ గౌడ్ గారు వాళ్ల అబ్బాయిని హీరోగా పరిచయం చేయాలని అనుకున్నారు. ఆ క్రమంలో యాక్షన్, మాస్, కమర్షియల్, మెసెజ్ ఓరియెంటెడ్ ‘ఫైటర్ శివ’ సబ్జెక్ట్ చెప్పాను. రమేష్ గారు మా వెన్నంటే నిల్చున్నారు. తెలంగాణ నుంచి మణికాంత్ అనే స్టార్ హీరో రాబోతోన్నాడు. మా మూవీని అందరూ ఆశీర్వదించండి’ అని అన్నారు.

ఎమ్మెల్యే రామలింగం మాట్లాడుతూ .. ‘‘ఫైటర్ శివ’ కోసం ప్రభాస్ ఎంతో కష్టపడ్డారు. ప్రభుత్వం డ్రగ్స్ మీద చేసే పోరాటం ఆధారంగా ‘ఫైటర్ శివ’ను తెరకెక్కించారు. చిరంజీవి గారు ఎప్పుడూ కూడా కొత్త వాళ్లు రావాలని చెబుతుంటారు. ఇప్పుడు మణికాంత్ అనే కొత్త హీరో రాబోతోన్నారు. ‘ఫైటర్ శివ’ను అందరూ ఆదరించండి’ అని అన్నారు.

నిర్మాత నర్సింహా గౌడ్ మాట్లాడుతూ .. ‘నేను చాలా కథలు విన్నాను. ఓ టైంలో ప్రభాస్ గారు ఈ ‘ఫైటర్ శివ’ స్టోరీ చెప్పారు. ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు డ్రగ్స్ మీద పోరాడుతున్నారు. అదే సందేశాన్ని ఈ మూవీతో మేం ఇవ్వబోతోన్నాం. యువతను మేల్కొపేలా మా ‘ఫైటర్ శివ’ ఉంటుంది. త్వరలోనే ఈ మూవీ విడుదల కాబోతోంది. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా మా చిత్రం ఉంటుంది’ అని అన్నారు.

నిర్మాత ఉన్నం రమేష్ మాట్లాడుతూ .. ‘డ్రగ్స్ నిర్మూలించాలనే ప్రభుత్వ పోరాటాన్ని ఆధారంగా తీసుకుని ‘ఫైటర్ శివ’ను మా దర్శకుడు ప్రభాస్ నిమ్మల తెరకెక్కించారు. మణికాంత్ ఈ చిత్రంలో అద్భుతంగా నటించారు. ‘ఫైటర్ శివ’ పెద్ద విజయం సాధిస్తుంది. చిన్న సినిమా.. పెద్ద సినిమా.. అన్న తేడా లేకుండా అవుట్ పుట్‌ను బట్టి ఆడియెన్స్ ఆదరిస్తారు. ‘ఫైటర్ శివ’ అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది’ అని అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ గౌతం రవిరాం మాట్లాడుతూ .. ‘నేను ఇండస్ట్రీలోకి వచ్చి 20 ఏళ్లు అవుతోంది. ఇప్పటి వరకు ఓ 12 చిత్రాలు చేశాను. మరికొన్ని సినిమాలు చేతిలో ఉన్నాయి. ఇప్పుడు ‘ఫైటర్ శివ’ అని వస్తున్నాను. ప్రభాస్ నిమ్మల నాకు ఎన్నో ఏళ్ల నుంచి తెలుసు. ఆయన మంచి కథను రాసుకున్నారు. మ్యూజిక్, విజువల్స్, ఎడిటింగ్ బాగుంది. మణికాంత్ అద్భుతంగా నటించాడు. ఈ మూవీ గొప్ప విజయం సాధిస్తుంది’ అని అన్నారు.

ఈ కార్యక్రమంలో కెమెరామెన్ సురేందర్ రెడ్డి, నటుడు శ్రీధర్, ఆనంద్, ఎడిటర్ విశ్వనాథ్ తదితరులు పాల్గొని మాట్లాడారు.

Exit mobile version