హర్షవర్ధన్ రాణే, పూర్ణ జంటగా రవిబాబు దర్శకత్వంలో రూపొందిన ‘అవును’ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమాకు సీక్వెల్ గా ‘అవును 2’ తెరకెక్కింది. మరోసారి హర్షవర్ధన్ రాణే, పూర్ణ జంటగా నటించారు. ఈ సీక్వెల్ లో రెండు కొత్త పాత్రలు నికిత, సంజన జత కలిశాయి. ఈ సినిమా ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో దర్శకనిర్మాత రవిబాబు, సమర్పకులు సురేష్ బాబు, సెల్‌కాన్ ఎండీ మురళీకృష్ణ పాల్గొన్నారు.
అనంతరం రవిబాబు మాట్లాడుతూ…. ‘అవును’ ఎక్కడ ముగిసిందో, అక్కడి నుంచే ‘అవును-2’ ప్రారంభమవుతుంది. మరో రెండు కొత్త పాత్రలతో పాటు సెల్‌కాన్ ట్యాబ్ ‘అవును 2’లో కీలక పాత్ర పోషించింది. పార్ట్ 1లో కనిపించని కెప్టెన్ రాజును సీక్వెల్ లో చూపిస్తున్నాం. ప్రేక్షకులను ఉత్కంఠతకు గురి చేసే సినిమా ఇది. అని అన్నారు.
సురేష్ బాబు మాట్లాడుతూ.. ‘చక్కని స్క్రీన్ ప్లేతో ‘అవును’ కంటే చాలా ఉత్కంఠతతో రవిబాబు ఈ సినిమాను రూపొందించాడు. ది బెస్ట్ సీక్వెల్స్ జాబితాలో ‘అవును 2′ కూడా ఉంటుంది. డిసెంబర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అని అన్నారు. ఫ్లయింగ్ ఫ్రాగ్స్, సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.


