దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘బాహుబలి’ సినిమా ఎల్లలనేది లేకుండా అన్ని చోట్లా బంపర్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. తెలుగు, తమిళ, మళయాల, హిందీ భాషల్లో ఒకేసారి జూలై 10న విడుదలైన ఈ సినిమా దేశ వ్యాప్తంగా సరికొత్త రికార్డులను సృష్టిస్తూ తెలుగు సినిమా సత్తాను చాటుతుండగా, దేశం అవతల కూడా అదే స్థాయి రికార్డు కలెక్షన్లతో దుమ్మురేపుతోంది. అమెరికాలో ‘బాహుబలి’ కలెక్షన్లను చూసి అక్కడి ప్రఖ్యాత మీడియా సంస్థలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి.
అమెరికాలో తెలుగు సినిమా ఇంతకుముందెన్నడూ చూడని రేంజ్లో కలెక్షన్లు కొల్లగొడుతూ, హాలీవుడ్ వాకిట్లో ‘బాహుబలి’ తెలుగు సినిమా సత్తాను చాటుతోంది. విడుదలైన మొదటి వారాంతం ఈ సినిమా హాలీవుడ్ సినిమాలకు పోటీనిస్తూ అక్కడి బాక్సాఫీస్ కలెక్షన్లలో టాప్ 10లో చోటు సంపాదించుకుంది. దీంతో ఈ సినిమాపై హాలీవుడ్ కూడా ఓ కన్నేసి ఉంచింది. ఇక ముందే చెప్పినట్టుగానే ‘బాహుబలి’ సినిమాకు ప్రత్యేక ఇంటర్నేషనల్ వర్షన్ కోసం బాహుబలి టీమ్ అప్పుడే కసరత్తులు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.
‘బాహుబలి’ ఇంటర్నేషనల్ వర్షన్, తెలుగులోనే ఇంగ్లీష్, ఇతర ఇంటర్నేషనల్ భాషల సబ్‌టైటిల్స్‌తో విడుదల కానుంది. అయితే ప్రస్తుతమున్న తెలుగు వర్షన్‌నే హాలీవుడ్ సినిమాకు తగ్గట్టుగా ఎడిట్, సౌండ్ మిక్సింగ్ చేసి ఇంటర్నేషనల్ వర్షన్‌ను రెడీ చేయనున్నారు. ఈ వర్షన్‌ను సుమారు రెండు నెలల్లో పూర్తి చేసేసి విడుదలకు సిద్ధం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ వర్షన్ రిలీజ్ ఎప్పుడనేది హాలీవుడ్ సినిమాల షెడ్యూల్‌ను బట్టి నిర్ణయిస్తారని సమాచారం.
ప్రభాస్, రానా, అనుష్క, తమన్నాలు ప్రధాన పాత్రల్లో నటించగా ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించిన ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్, భారీ ఆర్ట్ వర్క్స్, రాజమౌళి విజన్ అన్ని వర్గాల ప్రేక్షకులనూ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.


