
‘బాహుబలి’.. ఇండియన్ సినిమాకు మార్కెట్ పరంగా, సాంకేతిక స్థాయి పరంగా ఓ సరికొత్త అర్థాన్నిచ్చిన సినిమా. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించగా దర్శక ధీరుడు రాజమౌళి సృష్టించిన ఈ విజువల్ వండర్ ఇండియన్ సినిమాలో ఓ ప్రభంజనాన్ని సృష్టించింది. ఇక ఈ సినిమాను అంతర్జాతీయ ప్రేక్షకులకూ చేరవేయాలన్న ఆలోచనలో రాజమౌళి బాహుబలికి ఇంటర్నేషనల్ వర్షన్‌ను కూడా సిద్ధం చేయించిన విషయం తెలిసిందే. ప్రఖ్యాత హాలీవుడ్ ఎడిటర్ విన్సెంట్ టబిల్లాన్ ఇంటర్నేషనల్ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా ఇంటర్నేషనల్ వర్షన్‌ను రూపొందించారు.
ఇప్పటికే భుసన్, టొరంటో లాంటి ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శించబడి మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న బాహుబలి, త్వరలోనే జపాన్, చైనాల్లో భారీ ఎత్తున విడుదలకు సిద్ధమైంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా బాహుబలి సినిమా ఆసియాలో మంచి పేరున్న ఫిల్మ్ ఫెస్టివల్ అయిన తైపై గోల్డెన్ హార్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శితం కానుంది. థైవాన్‌లో అతిపెద్ద ఫిల్మ్ ఫెస్టివల్‌గా పేరు తెచ్చుకున్న ఈ ఫెస్టివల్ నవంబర్ 5వ తేదీ నుండి నవంబర్ 26వ తేదీ వరకు జరగనుంది.
ఇక ఈ ఫెస్టివల్‌లో ‘బాహుబలి’ సినిమా నవంబర్ 7, నవంబర్ 26వ తేదీల్లో ప్రదర్శితం కానుంది. పలు ఇతర ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రతిభ చాటిన సినిమాలతో పాటు బాహుబలి ఈ ఫెస్టివల్‌లో ప్రదర్శితం కానుండడం సంతోషంగా ఉందని నిర్మాతల్లో ఒకరైన శోభు యార్లగడ్డ ఈ సందర్భంగా తెలిపారు.