
‘బాహుబలి’.. ఇండియన్ సినిమాకు మార్కెట్ పరంగా, సాంకేతిక స్థాయి పరంగా ఓ సరికొత్త అర్థాన్నిచ్చిన సినిమా. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించగా దర్శక ధీరుడు రాజమౌళి సృష్టించిన ఈ విజువల్ వండర్ ఇప్పుడు అంతర్జాతీయ వ్యాప్తంగా సినీ అభిమానులకు అలరించేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఇండియన్ సినిమాలో బాక్సాఫీస్ వద్ద ప్రభంజన సృష్టించిన ఈ సినిమాకు ఓ ఇంటర్నేషనల్ వర్షన్ కూడా ఉంటే బాగుంటుందన్న ఆలోచనలో రాజమౌళి ‘బాహుబలి’ ఇంటర్నేషనల్ వర్షన్‌ను సిద్ధం చేయించారు. ఇప్పటికే పలు ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమై మెప్పించిన ఈ ఇంటర్నేషనల్ వర్షన్ తాజాగా థియేట్రికల్ రిలీజ్‌కూ సిద్ధమైంది.
చైనా, థైవాన్, జపాన్ లాంటి దేశాల్లో ఈ సినిమాలను విడుదల చేసేందుకు పలు టాప్ డిస్ట్రిబ్యూషన్ కంపనీలతో ఒప్పందం కుదుర్చుకున్న బాహుబలి టీమ్, తాజాగా అతిపెద్ద మార్కెట్‌గా చెప్పబడే లాటిన్ అమెరికా డిస్ట్రిబ్యూషన్ హక్కులను అక్కడి ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ కంపనీ సన్ డిస్ట్రిబ్యూషన్ గ్రూప్ సొంతం చేసుకుంది. లాటిన్ అమెరికాలోని పెద్ద దేశాలైన బ్రెజిల్, కొలంబియా, అర్జెంటినా, మెక్సికో దేశాల్లో భారీ ఎత్తున బాహుబలి ఇంటర్నేషనల్ వర్షన్‌ను విడుదల చేసేందుకు సన్ డిస్ట్రిబ్యూషన్ గ్రూప్ సన్నాహాలు చేసుకుంటోంది. అక్కడి పరిస్థితులను బట్టి డిసెంబర్ నెల నుంచి జనవరి చివరి వారం వరకూ ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన రిలీజ్ డేట్స్ ప్లాన్ చేసిన సంస్థ అందుకు తగ్గట్టు ప్రమోషన్స్ కూడా చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ బాహుబలి సినిమాను నిర్మించిన విషయం తెలిసిందే!