ప్రముఖ నటుడు, మాజీ మంత్రి డాక్టర్ బాబు మోహన్‌ను ప్రతిష్టాత్మక “రేలంగి అవార్డు” వరించింది. ఆయన సినీ పరిశ్రమలో 41 వసంతాలు పూర్తి చేసుకుని, 2000కి పైగా చిత్రాల్లో నటించిన సందర్భంగా ‘తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్’, ‘భారత్ కల్చరల్ అకాడమీ’ సంయుక్తంగా ఈ పురస్కారాన్ని అందజేశాయి. ఈ ఆనందాన్ని పంచుకునేందుకు హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఛాంబర్‌లో ప్రత్యేక మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో తెలుగు చిత్ర నిర్మాతల మండలి కార్యదర్శి తుమ్మల ప్రసన్న కుమార్, నాగ బాల సురేష్, హీరో రాంకీ, నటుడు పృథ్వీరాజ్, జర్నలిస్ట్ సురేష్ కొండేటి తదితరులు పాల్గొన్నారు. బాబు మోహన్ కేవలం నటుడిగానే కాకుండా, ఎన్టీఆర్ కేబినెట్‌లో మంత్రిగా చేసిన నిస్వార్థ సేవలను వారు ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. రేలంగి వంటి మహానటుడి పేరుతో ఉన్న అవార్డు బాబు మోహన్‌కు దక్కడం అర్హుడికి దక్కిన గౌరవమని వక్తలు ప్రశంసించారు.
అనంతరం బాబు మోహన్ మాట్లాడుతూ.. ఈ అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉందని, అవార్డుల కన్నా ప్రేక్షకుల ఆదరణే తనకు గొప్ప దీవెన అని పేర్కొన్నారు. రాజకీయాలకు దూరమయ్యాక ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కాగా, దశాబ్దాలుగా తన హాస్యంతో ప్రేక్షకులను అలరించిన బాబు మోహన్‌కు ప్రభుత్వాలు తక్షణమే ‘పద్మశ్రీ’ పురస్కారం ప్రకటించి సత్కరించాలని సినీ ప్రముఖులు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు.
