నాన్నగారు వారసత్వంగా ఇచ్చిందే అది..!

balakrishna
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా కొత్త దర్శకుడు సత్యదేవా దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘లయన్’. త్రిష, రాధికా ఆప్టే హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు సంబంధించిన ఆడియో ఆవిష్కరణ వేడుకను నిన్న (ఏప్రిల్ 9న) శిల్పకళావేదికలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బాలకృష్ణ తన స్టైల్ డైలాగులతో, మ్యానరిజంతో ఇచ్చిన స్పీచ్ అభిమానులను ఉర్రూతలూగించింది. భారీ డైలాగులు, మధ్యమధ్యలో తెలుగు పద్యాలు, చలోక్తులు విసిరి ఆద్యాంతం స్పీచ్‌ను రక్తికట్టించారు. ఓ సందర్భంలో, “మీరు ప్రతిసారీ కొత్తదనమున్న సినిమాలనే ఎలా తీస్తారు? కొత్త వారిని వెండితెరకు పరిచయం చేయాలన్న ఆలోచన ఎలా వస్తుందీ? అని చాలా మంది అడుగుతారు. మా నాన్నగారు నందమూరి తారక రామారావు గారు నాకు వారసత్వంగా ఇచ్చిందే కొత్తదనాన్ని. ఇక నా సినిమాలో కొత్తదనం లేకుండా ఎలా ఉంటుందీ?” అంటూ బాలకృష్ణ తన స్టైల్లో స్పీచ్ ఇచ్చారు. మణిశర్మ సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమాను రుద్రపాటి రమణారావు నిర్మించారు. ఏప్రిల్ 30న ఈ సినిమా భారీ ఎత్తున విడుదల కానుంది.

Exit mobile version