విడుదల తేదీ : జనవరి 12, 2025
123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5
నటీనటులు : నందమూరి బాలకృష్ణ, బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్దా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వశి రౌటేలా, సచిన్ ఖేడేకర్, హిమజ తదితరులు.
దర్శకుడు : బాబీ
నిర్మాతలు : సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
సంగీతం : ఎస్. థమన్
ఛాయాగ్రహణం : విజయ్ కార్తీక్ కన్నన్
కూర్పు : నిరంజన్ దేవరమానే
సంబంధిత లింక్స్ : ట్రైలర్
నటసింహం బాలయ్య – దర్శకుడు బాబీ కాంబినేషన్ లో సంక్రాంతి కానుకగా వచ్చిన సినిమా “డాకు మహారాజ్”. కాగా భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్ష లోకి వెళ్ళి చూద్దాం.
కథ :
చంబల్ ప్రాంతంలో తాగు నీరు, సాగు నీరు లేక అక్కడి ప్రజలు ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు. మరోవైపు భలవంత్ సింగ్ ఠాగూర్ (బాబీ డియోల్) అతని మనుషులు అక్కడి ప్రజలను మరింత కష్ట పెడుతూ ఉంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఇంజనీయర్ సీతారాం (నందమూరి బాలకృష్ణ) గురించి తెలిసి, ఆయన అయితేనే తమ కష్టాలు తీర్చగలరు అని ఆ చంబల్ ప్రాంతం ప్రజలు సీతారాంను కలుస్తారు. మరి సీతారాం వారి కష్టాలు విని, ఆ ప్రాంతానికి నీరు తేవడానికి ఏం చేశాడు ?, ఈ క్రమంలో సీతారాం ఎదుర్కొన్న పరిస్థితులు ఏమిటి ?, ఇంతకీ.. డాకు మహారాజ్ ట్రాక్ ఏమిటి ?, సీతారాం డాకు మహారాజ్ గా ఎలా మారాడు ?, చివరకు డాకు మహారాజ్ ఏం సాధించాడు? అనేది మిగిలిన కథ.
ప్లస్ పాయింట్స్ :
ఎప్పటిలాగే, సీతారామ్ గా, డాకు మహారాజ్ గా తన పాత్రలో బాలయ్య అద్భుతంగా నటించాడు. కీలక సన్నివేశాల్లో బాలయ్య అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్. బాలకృష్ణ నుంచి ఆయన అభిమానులు ఎలాంటి సినిమా కోరుకుంటున్నారో, ఈ సినిమా అలాగే భారీ విజువల్స్ మరియు ‘వైల్డ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్’ తో సాగింది. ఇక వాటికి తగ్గట్టుగానే తన పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ, తన పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ తో బాలయ్య ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు.
‘డాకు మహారాజ్’తో తెలుగు తెరకు నేరుగా పరిచయం అయిన బాబీ డియోల్ తన పాత్రలో ఒదిగిపోయారు. కొన్ని కీలక సన్నివేశాల్లో ఆయన నటన చాలా బాగుంది. శ్రద్దా శ్రీనాధ్ తన పాత్రలో జీవించింది. ఆమె పాత్రలోని డెప్త్ కూడా ఆకట్టుకుంది. హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ కూడా చాలా బాగా నటించింది. ఆమె స్రీన్ ప్రెజెన్సీ కూడా చాలా బాగుంది. ఇతర కీలక పాత్రల్లో కనిపించిన చాందిని చౌదరి, ఊర్వశి రౌటేలా ఆకట్టుకున్నారు. అదేవిధంగా షైన్ టామ్ చాకోతో పాటు మిగిలిన నటీనటులు కూడా అయా పాత్రల్లో తమ నటనతో మెప్పించారు.
దర్శకుడు బాబీ కమర్షియల్ మూవీకి అనుగుణంగానే ప్లేను నడుపుతూ బాలయ్యను కొత్తగా చూపించిన విధానం బాగుంది. ముఖ్యంగా సినిమాలో యాక్షన్ ఎలిమెంట్స్ ను మరియు బలమైన భావోద్వేగాలను, అలాగే కామెడీ టచ్ ను కూడా సమపాళ్లలో పెట్టడం సినిమాకి ప్లస్ అయింది. ముఖ్యంగా బాలయ్య పై యాక్షన్ సీక్వెన్స్ లను ఎఫెక్టివ్ గా డిజైన్ చేశారు. అదే విధంగా పాత్రల చిత్రీకరణతో పాటు ఆ పాత్రల నేపథ్యాన్ని కూడా పర్ఫెక్ట్ గా డిజైన్ చేశారు.
మైనస్ పాయింట్స్ :
బరువైన ఎమోషన్స్ తో, భారీ విజువల్స్ తో వచ్చిన ఈ ‘హై యాక్షన్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ ‘డాకు మహారాజ్’ చాలా వరకు బాగా ఆకట్టుకున్నా.. కథనం పరంగా వచ్చే కొన్ని సీన్స్ సినిమా స్థాయికి తగ్గట్లు పూర్తి స్థాయిలో ఆకట్టుకోవు. అలాగే సినిమాలో ఉన్నంత హైప్ ను సినిమా మొత్తం కంటిన్యూ చేయలేక పోయారు. ఇక బాలయ్య – విలన్ల మధ్య ట్రాక్ ఇంకా బెటర్ గా ఉండి ఉంటే బాగుండేది. మొత్తానికి కథలో చెప్పాలనుకున్న మెయిన్ థీమ్ తో పాటు కీలక సన్నివేశాల్లో మంచి పనితీరుని కనబర్చిన దర్శకుడు బాబీ, మిగిలిన కొన్ని సన్నివేశాల్లో మాత్రం నెమ్మదిగా కనిపించారు.
సాంకేతిక విభాగం :
ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే.. సినిమాటోగ్రాఫర్ విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది. సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటు మిగిలిన యాక్షన్ సన్నివేశాలను కూడా కథాకథనాలకు అనుగుణంగా అద్భుతంగా చిత్రీకరించారు. నిరంజన్ దేవరమానే ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. ఇక సంగీత దర్శకుడు ఎస్.ఎస్. థమన్ సమకూర్చిన పాటలు చాలా బాగున్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా బాగుంది. నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంది. బాబీ రచయితగా దర్శకుడిగా ఈ చిత్రానికి పూర్తి న్యాయం చేశారు. మంచి కథ, బలమైన వైవిధ్యమైన పాత్రలతో చిత్రాన్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. కానీ, కొన్నిచోట్ల ఆయన కథనాన్ని ఇంకా ఆసక్తికరంగా మలిచి ఉంటే బాగుండేది. నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. వారి నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి.
తీర్పు :
మాస్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈ ‘డాకు మహారాజ్’లో.. వైల్డ్ యాక్షన్ సీక్వెన్సెస్ తో పాటు ఫీల్ గుడ్ ఎమోషన్స్ కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా బాలయ్య పవర్ ఫుల్ నటన, బాబీ దర్శకత్వం, మొత్తం సాంకేతిక విభాగం నుంచి అందిన మంచి పనితనం.. మొత్తం సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కానీ, కొన్ని సన్నివేశాలు రోటీన్ గా సాగడం వంటి అంశాలు మైనస్ అయ్యాయి. ఐతే, బాలయ్య తన నటనతో, తన మాస్ ఇమేజ్ తో ఈ సినిమాని మరో లెవల్ కి తీసుకు వెళ్లారు. ఓవరాల్ గా ఈ చిత్రం బాలయ్య అభిమానులతో పాటు మిగిలిన అన్ని వర్గాల ప్రేక్షకులను కూడా అలరిస్తుంది.
123telugu.com Rating: 3.25/5
Reviewed by 123telugu Team