ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె నిశ్చితార్థం.. తరలివచ్చిన సినీ, రాజకీయ ప్రముఖులు

నటుడిగా కెరీర్ ప్రారంభించి, టాలీవుడ్ బడా నిర్మాతగా ఎదిగిన బండ్ల గణేష్ ఇంట ఇప్పుడు పెళ్లి సందడి వాతావరణం నెలకొంది. ఆయన ముద్దుల కుమార్తె జనని బండ్ల నిశ్చితార్థ వేడుక ఆదివారం నాడు అత్యంత వైభవంగా జరిగింది. సూర్యతేజ చిలుకూరితో జనని వివాహం నిశ్చయమైంది. ఈ ఎంగేజ్‌మెంట్ ఈవెంట్ ఇటు సినీ, అటు రాజకీయ ప్రముఖుల కలయికకు వేదికగా మారింది.

తరలివచ్చిన తారలు.. సందడిగా వేడుక

రెండు రంగాలకు చెందిన అగ్రశ్రేణి ప్రముఖులు హాజరై కాబోయే దంపతులకు తమ ఆశీస్సులు అందించారు. మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున, నారా చంద్రబాబు నాయుడు లాంటి దిగ్గజాలు విచ్చేయడంతో ప్రాంగణం కళకళలాడింది. వీరితో పాటు ప్రముఖ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి, లగడపాటి రాజగోపాల్, మైత్రీ నవీన్ యెర్నేని, టీజీ విశ్వప్రసాద్, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తదితరులు పాల్గొని వేడుకకు మరింత వన్నె తెచ్చారు.

మరోవైపు, ఈ ఎంగేజ్‌మెంట్‌లో బండ్ల కుటుంబ సభ్యులు మెగాస్టార్ చిరంజీవి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్న ఒక వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. అటు రాజకీయ, ఇటు సినీ తారల రాకతో హాట్ టాపిక్‌గా మారిన ఈ వేడుకను చూసి అభిమానులు సైతం కొత్త జంటకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు. త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలు ఎక్కనున్నారు. వివాహ తేదీకి సంబంధించిన అధికారిక వివరాలను బండ్ల గణేష్ త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.

Exit mobile version