
విమల్ ,బిందు మాధవి హీరో హీరోయిన్లుగా తమిళంలో రూపొంది మంచి విజయం సాధించిన సినిమా ‘డేసింగు రాజా’. ఎళిల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను బాహుబలి సినిమాతో పాపులర్ అయిన ‘భల్లాలదేవ’ అనే పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. సత్యదేవ పిక్చర్స్ బ్యానర్‌పై రావిపాటి సత్యనారాయణ ‘భల్లాల దేవ’ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఇప్పటికే దాదాపుగా డబ్బింగ్ కార్యక్రమాలన్నీ పూర్తికాగా, త్వరలోనే సెన్సార్ కార్యక్రమాలు జరగనున్నట్లు సినిమా యూనిట్ తెలిపింది.
ఇక ఈ ఉదయం హైద్రాబాద్‌లో భల్లాల దేవ సినిమాకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు. ప్రముఖ దర్శకుడు కోదండరామి రెడ్డి టీజర్ లాంచ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన తెలుగులో కూడా ఈ సినిమా మంచి విజయం సాధించాలని కాంక్షించారు. ఇమాన్ ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహించారు. తెలుగులో అన్ని పాటలకూ వనమాలి సాహిత్యం సమకూర్చారు. ఇక సెప్టెంబర్ నెల మొదటి వారంలో ఆడియోను, మూడో వారంలో సినిమాను విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు నిర్మాత ఈ సందర్భంగా తెలిపారు.