ఇంటర్వ్యూ: డివివి.దానయ్య – మా బ్యానర్ కి ‘భరత్ అనే నేను’ గర్వపడే సినిమా అవుతుంది !

17th, April 2018 - 12:12:20 PM

నిర్మాతగా ఎన్నో విజయవంతమైన సినిమాల్ని నిర్మించిన నిర్మాత డివివి. దానయ్య ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 20న సినిమా రిలీజ్ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు మీకోసం..

నిర్మాతగా మీ జర్నీ గురించి చెప్పండి ?

1992లో ‘జంబలకడి పంబ’ సినిమాతో నిర్మాతగా నా ప్రయాణం మొదలైంది. ఇప్పటి వరకు ఎన్నో మంచి సినిమాలు తీశాను, చాలా మంది స్టార్ హీరోలతో పనిచేశాను.

మహేష్ తో సినిమా ఎలా కుదిరింది ?

మహేష్ బాబుతో సినిమా చేయాలనేది నా కల. ఎన్నో సంవత్సరాలు ట్రై చేశాను. చివరికి ఈ ‘భరత్ అనే నేను’ సినిమాతో ఆ కల నెరవేరింది.

ఈ సినిమాను నిర్మించడం ఎలా అనిపిస్తోంది ?

ఈ సినిమాను మా బ్యానర్ కు గర్వపడే గొప్ప సినిమా అవుతుంది. ఈ సినిమాను నిర్మించడం చాలా ఆనందంగా ఉంది.

మహేష్ బాబుతో మీ జర్నీ గురించి ?

నేను చాలా మంది స్టార్ హీరోలతో వర్క్ చేశాను. కానీ మహేష్ తోనే ఎక్కువ సాన్నిహిత్యం ఏర్పడింది. పొద్దున్న సెట్స్ కి వచ్చేటప్పుడు ఎలా ఉంటాడో సాయంత్రం వెళ్లేటప్పుడు కూడ అదే ఎనర్జీతో ఉంటాడు. సరదాగా జోకులు వేస్తూ నవ్విస్తూ ఉంటాడు.

ఇంతకీ సినిమా ఎలా ఉండబోతోంది ?

సినిమా అయితే చాలా గొప్పగా ఉండబోతోంది. ప్రతి సీన్ థియేటర్లో కూర్చునేలా చేస్తుంది. దానయ్య అనే నేను ‘భరత్ అనే నేను’ సినిమా అందర్నీ అలరిస్తుందని హామీ ఇస్తున్నాను.

మీ దర్శకుడు కొరటాల శివ గురించి చెప్పండి ?

ఈ సినిమా చేసినందుకు దర్శకుడు కొరటాల శివకు నేను రుణపడి ఉంటాను. ఎంతో గొప్పగా సినిమాను రూపొందించారు.

ఈ కథ పట్ల ప్రేక్షకులు ఎలా రియాక్ట్ అవుతారని అనుకుంటున్నారు ?

ఈ కథ విన్నప్పుడు మహేష్ ముఖ్యమంత్రి అనగానే థ్రిల్లింగా అనిపించింది. ప్రేక్షకులు కూడ అదే థ్రిల్ ఫీలవుతారు.

హీరోయిన్ కైరా అద్వాని గురించి చెప్పండి ?

అసలు నార్త్ అమ్మాయిలాగే అనిపించదు. చాలా సహజంగా నటించింది. ఈ సినిమా తరవాత ఆమెకు చాలా ఆఫర్లు వస్తాయి.

రామ్ చరణ్ సినిమా ఎంత వరకు వచ్చింది ?

ఇప్పటికే రెండు షెడ్యూల్స్ అయ్యాయి. త్వరలోనే చరణ్ కూడ షూటింగ్లో పాల్గొంటారు.

రాజమౌళి మల్టీ స్టారర్ గురించి ఏమైనా చెప్పండి ?

అది కూడ గొప్ప సినిమా అవుతుంది. ఎప్పుడో ఖచ్చితంగా చెప్పలేను కానీ ఈ ఏడాదిలోనే సినిమా మొదలవుతుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.